డీఆర్‌ఓ బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్ : జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) నరసింహులు బుధవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి బదిలీపై ఆయన ఇక్కడకు వచ్చారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ రెవెన్యూ సమ్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు.
‘పామ్’ రాయితీలకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు రాయితీలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నవంబర్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే రాయితీలు ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలో 24 మండలాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. హెక్టార్‌లో ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతుకు రాయితీగా ఇండియాలోని మొక్కలు అయితే రూ.20వేలు, ఇతర దేశాల మొక్కలు అయితే రూ.29 వేల వరకు అందించనున్నట్లు వివరించారు. అలాగే హెక్టార్‌లో అంతర పంటల సాగుకు రూ.5వేలు, ఎరువులకు రూ.5వేలు రాయితీ మంజూరు చేస్తామని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఆయా మండలాల్లోని ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.
బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎస్వీయూ జట్టు
తిరుపతి సిటీ : అన్నమయ్య జిల్లా మదనపల్లె బీటీ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్ కళాశాల మెన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఎస్వీయూ విద్యార్థులు విన్నర్స్‌గా నిలిచారు. అలాగే ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు రన్నర్స్‌గా సత్తా చాటారు. బుధవారం ఈ మేరకు గెలుపొందిన జట్లకు బీటీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఎస్వీయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎం.శివశంకర్‌రెడ్డి జ్ఞాపికలు, ధృవీకరణ పత్రాలు అందించి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment