● తిరుపతిలో జనసేన నేత దౌర్జన్యం ● నిర్మాణ పనులు ఆపేయించిన వైనం ● ఆందోళనతో ఆస్పత్రి పాలైన భవన యజమాని
సాక్షి టాస్క్‌పోర్స్ : ‘‘ఏయ్.. ఎవరిదీ ఈ బిల్డింగ్? ఎవరిని అడిగి కడుతున్నారు? భవనం కట్టేటప్పుడు మా పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? వెంటనే పనులు ఆపండి. బిల్డింగ్ నిర్మాణం జరగాలంటే.. నెలనెలా మాకు మామూళ్లు కట్టాలి. ఆ విషయం తేలేవరకు ఒక్క పని కూడా చేపట్టేందుకు వీలులేదు’’ అంటూ జనసేన నాయకుడు దౌర్జన్యానికి దిగాడు. వివరాలు.. తిరుపతి నగరంలోని 32వ వార్డులో ఓ ఉద్యోగి భవనం నిర్మించుకుంటున్నారు. ఇందుకోసం కార్పొరేషన్ అనుమతి కూడా తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ శ్లాబ్ పూర్తి చేసి.. మొదటి అంతస్తు నిర్మాణ పనులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అనుచరుడు 35వ వార్డుకు చెందిన జనసేన జనరల్ సెక్రటరీ తన అనుచరులతో కలిసి భవన నిర్మాణం వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగాడు. పనులు జరగాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము కొత్తగా ఆఫీసు పెట్టామని, నిర్వహణ కోసం ప్రతి నెలా డబ్బులు పంపాలని హుకుం జారీ చేశారు. సాయంత్రం మా మనిషిని పంపుతాం వెంటనే డబ్బులు ఇచ్చి పంపాలని ఆదేశించారు. కొంత సేపటికే జనసేన నేత అనుచరుడు గణేష్ అనే వ్యక్తి వచ్చి మామూలు అడిగినట్లు భవన యజమాని తెలిపారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అడిగినందుకు.. భవన నిర్మాణ వీడియోలు తీసి హడావుడి చేశారన్నారు. నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేశారని వాపోయారు. ఈ క్రమంలోనే ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment