ట్రాక్ తప్పకుంటేనే లైసెన్స్!
ఒకప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే దళారీని పట్టుకుంటే చాలు.. ఎంచక్కా పని పూర్తయ్యేది. అరకొర నైపుణ్యంతో బండి నడిపినా పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. అయితే ప్రస్తుతం లైసెన్స్ ప్రక్రియను రవాణాశాఖ అధికారులు కట్టుదిట్టం చేస్తున్నారు. వచ్చీరాని డ్రైవింగ్‌తో రోడ్డెక్కి ప్రమాదాలకు కారణం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులో తీసుకువస్తున్నారు. నిర్ణీత ప్రమాణాలతో వాహనం నడిపిన వారికే లైసెన్స్ మంజూరు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం ప్రక్రియను సెన్సార్ సాయంతో క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. సమగ్ర వివరాలను కంప్యూటర్‌లో సైతం నిక్షిప్తం చేయనున్నారు.
తిరుపతి మంగళం : డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం వచ్చే వారికి రవాణాశాఖ తనిఖీ అధికారులే పరీక్ష నిర్వహించి లైసెన్స్‌లను అందజేసే పద్దతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. మాన్యువల్‌గా సాగుతున్న ఈ విధానానికి స్వస్తి చెప్పి.. మోటారు వాహన చట్టం నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఆధునికీకరణకు రవాణాశాఖ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆటోమెటిక్ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నిర్దేశిత ప్రమాణాల మేరకు వాహనం నడిపితేనే డ్రైవింగ్ లైసెన్స్ లభించనుంది. ఈ క్రమంలో లైసెన్స్ కోసం టెస్టుకు వచ్చేవారు ఎలాంటి దొడ్డిదారి మార్గాలను అన్వేసించకుండా బాగా శిక్షణ తీసుకుని డ్రైవింగ్‌లో నైపుణ్యం సంపాదించాలని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి మురళీమోహన్ స్పష్టం చేస్తున్నారు.
పెరిగిన వాహనాల వినియోగం
ఇప్పుడు చాలా మందికి బైక్ లేదా కారు నిత్యావసరంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు అన్ని వర్గాల వారు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు. ఏటా వేలాది మంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. రవాణా రంగంలో డ్రైవర్లుగా చేరుతున్నారు. జిల్లాలో గత రెండేళ్లల్లోనే లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకోవడం విశేషం. అయితే చాలా మంది ఎలాంటి డ్రైవింగ్ టెస్టు లేకుండా లైసెన్స్ వచ్చేస్తే బాగుంటుందని బావిస్తుంటారు. ఇందుకోసం ఏజెంట్లను, మధ్యవర్తులను ఆశ్రయిస్తుంటారు. సరిగ్గా నేర్చుకోకుండా, టెస్టుకు హాజరుకాకుండా తప్పుడు పద్ధతుల్లో లైసెన్స్ తీసుకుని, ఆరకొర అనుభవంతో బండి నడిపితే ప్రమాదాల బారినపడే అవకాశముంటుంది.
మొక్కుబడి డ్రైవింగ్ టెస్ట్‌కు మంగళం
ఆటోమేటిక్ విధానంలో పరీక్ష
రహదారి నిబంధనల మేరు ఏర్పాట్లు
ప్రమాణాల మేరకే ఉత్తీర్ణత
వివరాలన్నీ కంప్యూటర్‌లో అప్‌లోడ్
వందలాదిమందికి టెస్ట్‌లు
జిల్లా వ్యాప్తంగా నిత్యం వందలాది మందికి డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని డ్రైవింగ్ ట్రాక్‌లలో వాహనదారులు వారి నైపుణ్యాన్ని సక్రమంగా ప్రదర్శిస్తేనే లైసెన్స్‌లు జారీ చేస్తున్నాం. వాహనదారులు డ్రైవింగ్‌పై బాగా పట్టు సాధించిన తర్వాతే టెస్ట్‌కు హాజరుకావాలి. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా లైసెన్స్‌లు పొందాలని చూస్తే మీకే నష్టమనే విషయం గుర్తు పెట్టుకోవాలి. తిరుపతి జిల్లా కార్యాలయంలోని డ్రైవింగ్ ట్రాక్‌ను త్వరలోనే ఆధునికీకరణ(సెన్సార్) చేయనున్నాం. – మురళీమోహన్,
జిల్లా రవాణాశాఖాధికారి (డీటీఓ)
టెస్ట్ ఇలా..
వాహదారుల డ్రైవింగ్ నైపుణ్యం పరీక్షించేందుకు రకరకాల ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. కారు నడిపేవారు అన్ని ట్రాక్‌లలో తమ ప్రతిభను చూపాల్సి ఉంటుంది. అలాగే ద్విచక్ర వాహనదారులు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు కూడా ప్రత్యేక ట్రాక్‌లు ఉంటాయి.
హెచ్ : వాహనం ముందుకు వెళ్లిన తర్వాత రివర్స్ చేయాల్సి వస్తే ఎలా తీసుకుంటారో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఎస్ : ఒక మూల నుంచి మరో మూలకు టర్న్ చేయాల్సివచ్చినప్పుడు ఎలా బండి నడుపుతున్నారో తెలుస్తుంది.
8 : బాగా మలుపులున్న రోడ్డుపై ఎలా ముందుకు వెళుతున్నారో తెలుసుకునేందుకు దోహదం చేస్తుంది.
ఎత్తు పల్లాల ట్రాక్ : ఎత్తయిన ప్రదేశాలు, చిన్న లోయ వంటి ప్రాంతాల్లో ఎలా వాహనం నడపగలరో పరిశీలించేందుకు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే చివరగా బండిని పార్కింగ్ చేసే పద్ధతిని కూడా పరీక్షిస్తారు.
– టెస్ట్‌కు హాజరయ్యే సమయంలో ఫోర్‌వీలర్ అయితే సీటు బెల్ట్, ద్విచక్రవాహనమైతే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే ఫెయిల్ చేస్తారు. ట్రాక్‌లో నడిపేటప్పుడు ఎలాంటి తప్పిదాలు చేసినా ఫెయిల్ అయినట్టుగా నిర్ధారిస్తారు. వీరు మరో నెల పాటు శిక్షణ తీసుకుని టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment