లైంగికదాడుల నివారణకు కృషి
తిరుపతి అర్బన్ : మహిళలపై లైంగికదాడుల నివారణకు కృషి చేయాలని, ఈ మేరకు అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సీడీపీఓలు వారి పరిధిలోని మహిళలకు అండగా ఉండాలని సూచించారు. మరోవైపు బాల్యవివాహాలతో వచ్చే అనర్థాలను వివరించాలని కోరారు. కిషోర్ వికాస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. పోషకాహారం లోపం నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆ దిశగా అంగన్‌వాడీ స్కూళ్లను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పోషకాహార లోపం తలెత్తకుండా గుడ్లు సక్రమంగా అందేలా, నాణ్యంగా ఉండేలా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోషణ్ ట్రాక్ యాప్ ద్వారా అంగన్‌వాడీ పిల్లల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి, డీసీపీఓ శివ శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment