దోపిడీ దేదీప్యం!
తిరుపతి కపిలతీర్థంలో అధికారుల దోపిడీ పర్వం దేదీప్యంగా వెలుగొందుతోంది. ఇక్కడ స్వామివారి ప్రత్యేక దర్శనానికి రూ.5 పెట్టి టిక్కెట్ కొనుగోలు చేయాలి. కానీ అధికారులు టిక్కెట్ ఇవ్వరు. అదేమని అడిగితే నలుగురికి కలిపి ఒక టిక్కెట్ రెండుగా చించి ఇస్తున్నారు. మరికొందరు భక్తులు అక్కడున్న అధికారుల చేతిలో రూ.5 పెట్టి దర్శనానికి వెళ్తున్నారు. ఇక పూజాసామగ్రి విషయానికొస్తే నాసిరకం అగ్గిపెట్టె, అగరఒత్తులు, నేతి దీపాలు విక్రయిస్తూ భక్తులను నిలువుదోపిడీకి గురిచేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నా పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేక దర్శనం పేరుతో..
పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించాక స్వామిని దర్శనం చేసుకోవాలనే భక్తులు ప్రత్యేక దర్శనం క్యూలో ప్రవేశించారు. ఆలయంలోకి వెళ్లక ముందు కౌంటర్ వద్ద ఒకరికి రూ.5 ప్రత్యేక దర్శనం టికెట్ అని చెప్పి వసూలు చేస్తున్నారు. రూ.5 చెల్లిస్తే కంప్యూటరైజ్డ్ టికెట్ ఇవ్వాలి. అయితే టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ఆలయ అధికారి ఒకరు రూ.5 చొప్పున వసూలు చేసినా టికెట్ ఇవ్వడం లేదు. భక్తులు కూడా రూ.5 చొప్పున ఆయన చేతిలో పెట్టి వెళ్తున్నారు. ఒకరో ఇద్దరో టికెట్ అడిగితే.. నలుగురికి కలిపి ఒక స్లిప్‌ని కంప్యూటర్ నుంచి తీసి ఇస్తారు. ఆ టికెట్‌ని రెండుగా చించి ఇద్దరికి ఒకటి చొప్పున ఇచ్చి పంపేస్తున్నారు. ఈ డబ్బు ఆలయ అభివృద్ధికి చేరుతుందా? కొందరు ఆలయ అధికారుల జేబులోకి వెళ్తుందా? అని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
● కపిలతీర్థం శివాలయంలో
అధికారుల నిలువు దోపిడీ
● ప్రత్యేక దర్శన టికెట్ కొన్నా..
టోకెన్ ఇవ్వరు
● అడిగితే నలుగురికి కలిపి ఒక టికెట్..
ఆ టికెట్ రెండుగా చించి ఇస్తున్న వైనం
● రోజూ భక్తుల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ఎవరి జేబులోకి?
● ఆలయం వద్ద నాసిరకం పూజా సామగ్రి
సాక్షి టాస్క్‌ఫోర్స్: కార్తీక మాసంలో భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఆలయాలకు వచ్చే భక్తుల నుంచి కొందరు అధికారులు, వ్యాపారులు దేవుడిపేరు చెప్పి దండుకుంటున్నారు. ఇదెక్కడో కాదండోయ్ తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో. అక్కడి అధికారులు, అక్కడి వ్యాపారులు కుమ్మకై ్క భక్తుల జేబులు గుల్లచేస్తున్నారు. కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని కపిలేశ్వరస్వామి ఆలయానికి రోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం వచ్చి వెళ్తుంటారు. సోమ, శనివారం అయితే భక్తుల రద్దీ రెండింతలు ఉంటుంది. కార్తీక మాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీకపిలేశ్వరాలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
నాసిరకం పూజాసామగ్రి
స్వామి వారి పూజ కోసం నెయ్యి లేదా దీపం నూనె, కొబ్బరికాయ, అగరబత్తీ, పూలు, పండ్లు, ఆకువక్క, పసుపు, కుంకుమ కొనుగోలు చేస్తున్నారు.. కార్తీక మాసం కావడంతో ఎక్కువశాతం మంది భక్తులు ప్రత్యేకంగా మారేడు దళం, ఉసిరి కాయతో నెయ్యి దీపం వెలిగిస్తున్నారు. ఈ మొత్తం పూజా సామగ్రి కేవలం ఒకరిద్దరు వ్యాపారుల వద్ద మాత్రమే దొరుకుతున్నాయి. కార్తీక మాసం కావడంతో ఎక్కువ మంది భక్తులు మారేడు దళం, ఉసిరి కాయను కత్తిరించి రెండు పత్తి ఒత్తిలు పెట్టి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించడం కనిపించింది. సాధారణంగా అయితే రెండు ఉసిరి కాయలు, అందులో పత్తితో ఒత్తులు నేతిలో ముంచి పెట్టి ఇస్తారు. అయితే కపిలేశ్వరస్వామి ఆలయం ముందు ఉన్న వ్యాపారులు అన్నీ విడి విడిగా ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఉసిరి కాయను బట్టి రేటు.. పెద్దవి అయితే రూ.30. చిన్నవి అయితే రూ.20. నెయ్యి ప్యాకెట్ రూ.10. ఇందులో నెయ్యి ఐదు చుక్కలకు మించి ఉండదు. అది కూడా నాసిరకం. వీటితో పాటు మిగిలిన సామగ్రి కూడా భక్తులు కొనుగోలు చేయడం సర్వసాధారణంగా కనిపించింది. పూలు విడిగా కావాలంటే మూర రూ.40. పూలు కాకుండా మొత్తం సామగ్రికి రూ.100 చెల్లిస్తే కానీ పూజ సామగ్రి రాదు. ఇందులో నెయ్యి, అగ్గిపెట్టె, అగరబత్తీ పూర్తిగా నాసిరకం. ఉసిరి కాయలు కాకుండా.. మట్టితో తయారు చేసిన ప్రమిద, అందులో 101 ఒత్తులు, అత్యంత నాసిరకమైన నెయ్యి కలిపి విక్రయిస్తున్నారు. వీటికి మరో రేటు. అగ్గిపెట్టె విడిగా కొనుగోలు చేయాలి. ఇవన్నీ తీసుకుని పుణ్యస్నానం అనంతరం పూజా సామగ్రి అంతా పెట్టి దీపం వెలిగిద్దాం అంటే అగ్గిపుల్ల వెలగదు. పెట్టెలోని అన్ని పుల్లలూ గీసినా దీపం వెలిగించాలంటే సాహసమే చేయాల్సి వస్తోంది. ఇదంతా అయ్యాక అగరబత్తీ వెలిగిద్దాం అంటే.. అవీ అత్యంత నాసిరకం. ఇదీ శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో భక్తుల అవస్థలు.
టిక్కెట్ ఇవ్వకుండా ఉండరు
శ్రీకపిలేశ్వరాలయంలో స్వామివారి ప్రత్యేక దర్శనానికి భక్తుల వద్ద డబ్బు తీసుకొని టిక్కెట్ ఇస్తారు. డబ్బులిచ్చినా టిక్కెట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితి లేదు. నాణ్యత లేని పూజా సామగ్రి విషయమై ఆలయం బయట జరిగే వాటితో మాకు సంబంధం లేదు. భక్తుల వద్ద నుంచి రూ.5 డబ్బు తీసుకొని టిక్కెట్ ఇవ్వకుండా పంపించి ఉంటే నాకు రిపోర్టు చేయొచ్చు. మీకు చించి ఇచ్చిన టిక్కెట్ రేపు తీసుకురండి.. చూద్దాం. – దేవేంద్రబాబు, శ్రీకపిలేశ్వరస్వామి ఆలయ డెప్యూటీ ఈఓ
Comments
Please login to add a commentAdd a comment