పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్య
● పలు కేసుల్లో నిందితుడు ● విచారించేందుకు వెళ్లిన పోలీసులను చూసి భయపడి.. ● మృతుడు విజయవాడ వాసి
తిరుచానూరు (చంద్రగిరి) : పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న ఓ యువకుడిని విచారించే నిమిత్తం తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసుస్టేషన్ పరిధిలోని వేదాంతపురం గ్రామానికి వెళ్లిన ఏలూరు జిల్లా పోలీసులకు ఊహించని పరిణామం ఎదురైంది. పోలీసులను చూసి భయపడిన నిందితుడు బుధవారం వేకువజామున తన ఇంట్లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి కుటుంబం, పోలీసుల కథనం మేరకు.. విజయవాడ ఎల్‌ఐసీ కాలనీకి చెందిన నీలం సూర్యప్రభాస్ (21)పై వైజాగ్, మాచవరం, కర్నూలు, సూర్యపేట, పెనమలూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు తదితర ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లకు సంబంధించి దాదాపు 15 కేసులున్నాయి. అతడికి భార్య హారిక, కుమారుడు ఉన్నాడు. కులాంతర వివాహం చేసుకున్న సూర్యప్రభాస్ మూడు నెలల క్రితం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం గ్రామానికి కుటుంబంతో కలిసి వెళ్లి జీవిస్తున్నాడు. హారిక బాలికగా ఉన్న సమయంలో ప్రేమించడంతో సూర్యప్రభాస్‌పై పోక్సో కేసు పెట్టగా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. భవన నిర్మాణ కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పలు కేసుల్లో అతను నిందితుడిగా ఉన్న నేపథ్యంలో విచారణ నిమిత్తం ఏలూరు జిల్లా లక్కవరం ఎస్‌ఐ రామకృష్ణ, జంగారెడ్డి గూడెం క్రైం ఏఎస్‌ఐ సంపత్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు సూర్యప్రభాస్ కోసం గాలిస్తూ మంగళవారం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురానికి వెళ్లారు. సూర్యప్రభాస్ ఇంటికి వెళ్లి విచారణకు రావాలని కోరగా.. పోలీస్‌స్టేషన్‌కు రానని చెప్పాడు. ఈ నేపథ్యంలో బుధవారం మరోసారి పోలీసులు సూర్యప్రభాస్ నివాసానికి చేరుకున్నారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో చుట్టు పక్కల వారిని విచారించారు. ఇంటికి ఎప్పుడూ తాళాలు వేసి, వారు లోపల ఉంటారని చెప్పారు. అనుమానంతోనే విచారణ చేస్తున్నామనీ, ఒక్కసారి రావాలని పోలీసులు పదేపదే కోరారు. అయితే ఇంటి బయట పోలీసులను చూసి భయపడిన సూర్యప్రభాస్ బుధవారం వేకువజామున ఇంట్లో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పుటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బయట నుంచి ఇంటి తలుపులు పగులగొట్టి అతని భార్య, కుమారుడిని కాపాడి.. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసుల ఒత్తిడే కారణమా?
పోలీసులు విచారణకు రావాలంటూ ఒత్తిడి చేయడంతో బట్టలు మార్చుకుని వస్తానంటూ చెప్పిన సూర్యప్రభాస్ పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకుని ఆత్యహత్యకు పాల్పడగా.. పోలీసుల నిర్వాకంతోనే ఇలా జరిగిందంటూ గ్రామంలోని ప్రజలు తిరగబడ్డారు. నిందితుడు ఆత్మహత్యకు పాల్పడడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు సూర్యప్రభాస్ భార్య, కుటుంబ సభ్యులతో మాట్లా డి సెటిల్‌మెంట్ చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా పోలీసులు లేకుంటే తాము కూడా మంటలు అంటుకుని కాలిపోయేవారమని మృతుడి భార్య హారిక చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment