పులికాట్‌కు విదేశీ విహారి
● ఆహార వేటలో వలస పక్షుల విన్యాసాలు
పులికాట్.. అందాల హరివిల్లు.. ఆ ప్రకృతి సొయగాలకు విదేశీ వలస విహంగాలు వచ్చి చేరడంతో మరిన్ని హంగులు చేకూరాయి. సరస్సు అలలపై మల్లెలు తేలియాడుతున్న భావన కలుగుతోంది. పక్షులు ఆహార వేట అబ్బుర పరుస్తోంది.
సూళ్లూరుపేట: పులికాట్ సరస్సు జలకళను సంతరించుకోవడంతో విదేశీ వలస విహంగాలు వచ్చి చేరి, పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి శీతాలకాలంలో మాత్రమే ఈ ప్రాంతానికి విచ్చేసి నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట లాంటి ప్రాంతాల్లోని చెట్లపై గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తిని చేసుకుని వెళుతున్నాయి. ప్రతి ఏటా అక్టోబర్ నుంచి మార్చి దాకా ఈ ప్రాంతాలోని ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నేలపట్టును బ్రీడింగ్ సెంటర్‌గా, పులికాట్ సరస్సును ఫీడింగ్ సెంటర్‌గా ఉపయోగించుకుని వెళుతున్నాయి. అందుకే విదేశీ వలస విహంగాలకు ఈ ప్రాంతం మెట్టినిల్లుగా పేరుగాంచింది. ఈ ప్రాంతానికి ఫ్లెమింగోలు, గూడ భాతులు, సముద్రపు పావురాయిలు, ఏర్రకాళ్ల కొంగలు, నత్తగుల్ల కొంగలు, నీటి కాకులు, స్వాతి కొంగలు, పరజలు, పలు రకాల బాతులు గుంపులు గుంపులుగా వచ్చి చేరాయి. సూర్యోదయం వేళలో మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయ భానుడు ప్రకాశించే సమయంలో ఈ వలస విహంగాల ఆకాశంలో విహరిస్తున్న దృశ్యాలు ప్రకృతి ప్రియులను పులకరింపజేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment