మత్స్యకారులపై కూటమి సర్కారు శీతకన్ను | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులపై కూటమి సర్కారు శీతకన్ను

Published Thu, Nov 21 2024 1:18 AM | Last Updated on Thu, Nov 21 2024 2:06 PM

-

● అందని మత్స్యకార భరోసా.. రాయితీ 

● ఇబ్బందుల్లో మత్స్యకారులు 

● నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం 

చిల్లకూరు: సముద్రంలో చేపల వేటతో జీవనం సాగించే నిరుపేద మత్స్యకారులకు అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరించింది. మత్స్యకారులను ఆదుకోలేమంటూ చేతులెత్తేసింది. ఎన్నికల సమయంలో వేట విరామ పరిహారం రెండింతలు చేస్తామని ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వం వేట విరామ పరిహారం ఏడాదికి రూ.10 వేలు చొప్పన ఇస్తుండగా కూటమి నాయకులు దానిని రూ.20 వేలు చేసి, అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి నేటికి ఆరు నెలలు దాటుతున్నా ఆ ఊసే ఎత్తడంలేదు. 2014–19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒక బోటు ఉన్న మత్స్యకారుడుకి రూ.4 వేలు పరిహారం ఇచ్చేది. అది కూడా రెండేళ్లకొకసారి అందించేది గగనంగా ఉండేది. అలాంటిది 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి క్రమం తప్పకుండా రూ.10 వేల చొప్పున మత్స్యకారుల ఖాతాలో నగదు జమ చేశారు.

జీవన శైలి ప్రత్యేకం
మత్య్సకారుల జీవన శైలి విబిన్నంగా ఉంటుంది. నేడు మత్స్యకారులు కూడా జీవన విధానాలలో మార్పులు చేసుకుంటూ వస్తూ కొంత రాజకీయంగా ఎదుగుదల చెందాలని ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ మత్స్యకార గ్రామాల్లో లిపి లేని వారి భాష మాట్లాడుతుంటే విన సొంపుగా ఉంటుంది. వారి ఆచార వ్యవహారాలు కొన్ని ఆసక్తిగా ఉండడమే కాకుండా కఠినంగా కూడా ఉంటాయి. మత్స్యకార గ్రామాల్లో ఏళ్ల తరబడి నివసించే మత్స్యకారులు ఒకే మాట, ఒకే బాటలో నడుస్తూ కట్టుబాట్లకు కట్టుబడి ముందుకు సాగుతారు. వీరు తమ కట్టుబాట్లుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి గ్రామంలోనూ పెద్దకాపు, నడిపి కాపు, చిన్న కాపు అని ముగ్గురు మత్స్యకారులు గ్రామ కాపులుగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా కట్టుబాట్లును ధిక్కరిస్తే వారికి తగిన జరిమానా కూడా విధిస్తారు. 

గ్రామానికి సంబంధించి భార్యభర్తల వివాదాల నుంచి గ్రామ సమస్యల వరకు పరిష్కరించుకునేందుకు వీరు కాపుల మాటే వేదంగా భావిస్తారు. విరామం సమయంలో సముద్రం మీదకు వేటకు వెళ్లినా, గ్రామ నిబంధనలు ధిక్కరించినా.. గ్రామ కాపుల ముందు పంచాయితీ పెడతారు. వారు ఏ తీర్పు ఇచ్చినా దాన్ని శిరసావహిస్తూ కచ్చితంగా అనుసరించాల్సి ఉంది. అలా కాకుండా కట్టుబాట్లును ధిక్కరించిన వారికి పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సమస్యనూ గ్రామం దాటి పోలీస్టేషన్లకు వెళ్లన్వికుండా అక్కడే పరిష్కరించుకునేలా చూసుకుంటారు. ఇలా జరిమానా ద్వారా వచ్చిన సొమ్మును కాపులు గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు.

పరిహారం ఊసే లేదు
ఎన్నికల సమయంలో మ త్స్యకారులకు వేట విరా మ సమయంలో అందించే పరిహరంను ఇప్పటి వరకు అందివ్వలేదు. గతంలో కన్నా రెండింతలు అదికంగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వేట విరామ సమయంలో పనులు లేకుండా ఉన్నప్పటికి ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్మకంగా ఉన్నాం, నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. గతంలో అదికారంలో ఉన్నప్పడు కూడా సక్రమంగా వేట విరామ పరిహారం ఇచ్చందిలేదు. 
–పోలయ్య, మత్స్యకారుడు, కొండూరుపాళెం, వాకాడు మండలం

ఎలా బతకాలి?
ఎన్నికలప్పుడు కూటమి నేతలు మత్స్యకారులకు ఇచ్చిన హామీలు ఒకటీ నె రవేర్చడంలేదు. సముద్రం పై వేట వెళ్లే మాకు ఏడాదికి ఒకసారి మత్స్యకార భరోసా ఇచ్చేందుకు ఇంత కష్టమా?.. బోటు యజమానులకు డీజిల్‌ రాయితీ కూడా అమలు చేయక పోతే మత్స్యకారులు ఎలా బతకాలి. 
–శివకుమార్‌, మత్స్యకారుడు, ఇరకం, తడ మండలం

మూడు నెలలుగా వేట సక్రమంగా సాగలేదు
సముద్రంలో వేటకు వెళ్లి చేపలు పట్టుకుని ఏ పూటకు ఆ పూట కుటుంబాలను పోషించుకునే వారం. అయితే గత మూ డు నెలలుగా సముద్రంలో తుపాను అలజడి కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. దీంతో వేటకు వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా రు. ఇలా ప్రతి 15 రోజల కొకసారి మూడు రోజలు పాటు వేటకు దూరంగా పస్తులతో కాలం గడుపుతున్నాం.
– మేకల నాగరాజు,మత్స్యకారుడు, మోమిడి, చిల్లకూరు మండలం

గతంలో నవరత్నాలతో వెలుగులు
రాష్ట్రంలోని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల పథకాలు తీరప్రాంత మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాయి. 2014లోని సర్కారు చేపల వేటకు ఉపయోగించే బోట్లకు డీజిల్‌ లీటరుకు రూ.6.03 సబ్సిడీ ఇవ్వగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తరువాత దాన్ని రూ.9 చేశారు. ఒక్కొక్క బోటుకు నెలకు రాయితీపై 300 లీటర్లు డీజిల్‌ అందజేశారు. ఆ మేరకు ఎంపిక చేసిన పెట్రోలు బంకుల్లో నేరుగా ఆయిల్‌ తీసుకునే అవకాశం కల్పించారు. 

అలాగే చేపలవేట నిషేధ కాలంలో 2014కు ముందున్న ప్రభుత్వాలు మత్స్యకారులకు రూ.4 వేలు భృతిని ఇస్తుండగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచారు. వేట సమయంలో ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే ప్రమాద బీమాను రూ.10 లక్షలకు, అంగవైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలకు పెంచారు. దీంతో తీరప్రాంత మత్స్యకారుల్లో సంతోషం వెల్లివిరిసింది. అయితే నేటి ప్రభుత్వం వాటికి చెల్లు చీటీ పాడింది. ఫలితంగా మత్స్యకారులు ఇక్కట్లు పడుతున్నారు.

కూటమి ప్రభుత్వంలో అందని భరోసా
ఎన్నికల సమయంలో మత్స్యకారులపై అమితమైన ప్రేమను ఒలకబోసిన కూటమి నాయకులు నేడు అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వంపై నెపం మోపుతూ మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇవ్వాల్సిన రూ.10 వేల పరిహారం(మత్స్యకార భరోసా) ఇచ్చేందుకు కూటమి నాయకులు మోకాలు అడ్డుపెట్టి తమ వద్ద నిధులు లేవని, అందువల్ల కేటాయింపులు చేయలేక పోతున్నామని పెద్దల సభలో చెప్పించడం చూస్తుంటే ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితిలో లేదని అర్థం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement