వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి
రామచంద్రాపురం: ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని మెడ్‌జీ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న స్కూల్ లీడర్‌షిప్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన 200 మంది ఉపాధ్యాయులకు 6 రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. గత ఏడాది తొలి విడత 21వ శతాబ్దపు విద్యా నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వగా ఈ ఏడాది సమ్మిళిత విద్య, వాతావరణ మార్పులు, స్కూల్ లీడర్‌షిప్, అకౌంట్స్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలన్నారు. ఏఎంఓ శివశంకరయ్య, ఏఏఎంఓ మధు, చంద్రగిరి ఎంఈఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment