జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: జలజీవన్ మిషన్ పథకానికి చెందిన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. జిల్లాలో 2,532 పనులకు సంబంధించి ఇప్పటివరకు 1,333 పనులు పూర్తి చేశారని, మిగిలిన పనులు వచ్చే డిసెంబర్‌కి పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా ఇంజనీర్ విజయకుమార్‌ను ఆదేశించారు. మరోవైపు ఎంపీ లాడ్స్ కింద మంజూరైన నిధులకు చెందిన పనులు, జెడ్పీ, సీపీడబ్ల్యూఎస్ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ పాఠశాలల్లోను మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
పంచరామాలకు ప్రత్యేక బస్సు
– రేపటి నుంచి 24 వరకు యాత్ర
తిరుపతి అర్బన్: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం పంచరామాల దర్శనం కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు తిరుపతి డిపో మేనేజర్ బాలాజీ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతి బస్టాండ్ నుంచి బస్సు సర్సీసు ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సర్వీసు నెల్లూరు, గుంటూరు, విజయవాడ మీదుగా సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి పరి సరాల్లోని పంచరామాలలో ఆలయ దర్శనం ఉంటుందన్నారు. ఇందుకోసం సూపర్ లగ్జరీ సర్వీసును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సర్వీసు ఈ నెల 24వ తేదీన తిరిగి తిరుపతి బస్టాండ్‌కు చేసుకుంటుందని స్పష్టం చేశారు. రిజర్వేషన్ కోసం 94409 83564, 89193 22158 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు శివక్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఉమ్మడి జిల్లా రగ్బీ జట్టుకు శిక్షణ శిబిరం ప్రారంభం
బుచ్చినాయుడుకండ్రిగ: చదువుతోపాటు క్రీడా పోటీల్లో కూడా రాణించాలని ఎంఈఓ రవీంద్రనాథ్ అన్నారు. బుధవారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో రాష్ట్ర స్థాయి రగ్బీ అండర్–17 ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలికల జట్టు శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్థానికంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలి కల జట్టు శిక్షణ ఇవ్వటం గర్వంగా ఉందన్నారు. మూడు రోజుల పాటు వీరికి పీడీ, పీఈటీలు శిక్షణ ఇస్తారన్నారు. విద్యార్థులు శిక్షణతో మరింత రాటుదేలి క్రీడాపోటీల్లో సత్తా చాటి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణయ్య, గ్రామస్తులు సుధాకర్‌నాయుడు, వ్యాయామోపాధ్యాయులు కిషోర్, మస్తాన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వంకలో పడి వృద్ధుడి మృతి
నాగలాపురం: వంకలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని నందనం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు కథ నం మేరకు.. నందనం గ్రామానికి చెందిన కుమ్మర కుప్పయ్య(63) గతంలో తమిళనాడులోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యురిటీగా పనిచేస్తుండేవాడని, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు అదే గ్రామానికి చెందిన కొందరు స్థానికులు వంకలో శవం తేలి ఉండడం గమనించి స్థానిక రెవిన్యూ సిబ్బంది వీఆర్వో సుకుమార్‌కు సమాచారం అందించారు. వీఆర్వో సమక్షంలో పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో మృతదేహాన్ని బందుమిత్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment