యుద్ధ వీరుడు వైఎస్ జగన్
తిరుపతిలో అంబరాన్ని అంటిన జగనన్న జన్మదిన సంబరం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: యుద్ధవీరుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా తిరుపతి నగరంలోని ఓ కల్యాణ మండపంలో నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. పోరాటాలుతో పుట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడున్నర లక్షల కోట్లు నేరుగా ప్రజలుకు అందించారని గుర్తుచేశారు. మోసంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో ఓడి పోయి, మూడేళ్ల వరకు చంద్రబాబు ప్రజల్లోకి రాలేక పోయారని గుర్తుచేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓటమి తర్వాత 15 రోజుల్లోనే ఢిల్లీ నడి వీధుల్లో పోరాటం చేశారని తెలిపారు.
సాంకేతికంగా ఓడిపోయాం.. నైతికంగా గెలిచాం
రాష్ట్రంలో తమ పార్టీ సాంకేతికంగా ఓడిపోయినా.. నైతికంగా గెలిచామని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నామని వెల్లడించారు. ఇదే అంశంపై ఈ రోజు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
ప్రజలు పూర్తిగా విసిగిపోయారు
ఈ ఆరునెలల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగి పోయారని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం తెలిపారు. సూపర్‌సిక్స్ హామీలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు.
దేశానికే ఆదర్శం వైఎస్ జగన్ పాలన
గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రచారం చేసుకోవడంలో మనం వెనుకబడి పోయామన్నారు. నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లతో భూముల విలువ పది రెట్లు పెరిగిందన్నారు.
అభివృద్ధి అడుగడుగునా కనిపిస్తోంది
వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన అభివృద్ధి తిరుపతిలో అడుగడుగునా కనిపిస్తోందని నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి వివరించారు. సీఎం చంద్రబాబు సుపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత బస్సు అన్నారు, ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామని, దానిని ఇప్పుడు ఒక మూలన పడేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో తిరుపతి నగరంలో ఇంతటి అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment