నేడు స్పెల్‌బీ సెమీఫైనల్స్
తిరుపతి ఎడ్యుకేషన్ : సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో స్పెల్‌బీ సెమీఫైనల్స్ (మూడవ రౌండ్) పరీక్షను తిరుపతి జీవకోనలోని విశ్వం హైస్కూల్‌లో ఆదివారం ఉదయం 10గంటల నుంచి నాలుగు కేటగిరిలో నిర్వహించనున్నట్లు సాక్షి ఈవెంట్స్ ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇదివరకు పాఠశాల, జిల్లా స్థాయిలో నిర్వహించిన స్పెల్‌బీ పోటీల్లో ప్రతిభ చూపి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన తిరుపతి, వైఎస్సార్ కడప, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాల విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవ్వాలన్నారు. ఉదయం 10గంటలకు కేటగిరి–1, 11గంటలకు కేటగిరి–2, మధ్యాహ్నం 12గంటలకు కేటగిరి–3, ఒంటి గంటకు కేటగిరి–4 విభాగాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్ యూనిఫాం, స్కూల్ ఐడీ కార్డుతో పాటు పెన్ను, పెన్సిళ్లు, రైటింగ్ ప్యాడ్‌తో పరీక్ష సమయానికి ముందే చేరుకోవాలని ఆయన సూచించారు.
10న వైకుంఠ ఏకాదశి పూజలు
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి, 11న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ రెండు పర్వదినాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
బంగారు కొండలు!
– 14 మంది గురుకుల విద్యార్థినులకు బంగారు పతకాలు
నాయుడుపేటటౌన్: మండల పరిధిలోని బిరదవాడ గ్రామ సమీపంలో ఉన్న పుదూరు బాలికల గురుకులంలోని విద్యార్థినులు 14 మంది నేషనల్ హ్యాండ్ రైటింగ్ ఒలింపియాడ్ పరీక్షల్లో బంగారు పతాకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ రూత్‌రమోల తెలిపారు. సెప్టెంబర్ 20వ తేదీన గురుకుంలో జరిగిన నేషనల్ హ్యాండ్ రైటింగ్ ఒలింపియాడ్ పరిక్షల్లో 138 మంది విద్యార్థినులు పాల్గొన్నారని తెలిపారు. అందులో శనివారం వెలువడిన ఫలితాల్లో గురుకులానికి చెందిన 14 మందికి బంగారు పతాకాలు వచ్చాయని వెల్లడించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ విద్యార్థినులను, పరీక్షల కో–ఆర్డినేటర్‌లు చంద్రలీల, స్వర్ణలత, సరితను ప్రత్యేకంగా అభినందించారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు 65,299 మంది స్వామివారిని దర్శించుకోగా 20,297 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment