ముక్క ముట్టాలంటే భయం!
జిల్లాలో నెల క్రితం చికెన్ ధరలు
బ్రాయిలర్ కిలో రూ.260
లింగాపురం రూ.280
ట్రే గుడ్లు రూ.185
మంగళవారం ధరలు
బ్రాయిలర్ కిలో రూ. 170
లింగాపురం రూ. 230
ట్రే గుడ్లు రూ. 170
కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ
● ఆందోళనలో మాంసం ప్రియులు
● పడిపోతున్న చికెన్ విక్రయాలు
● ఎలాంటి భయమొద్దంటున్న అధికారులు
తిరుపతి తుడా: ముక్క ముట్టాలంటే జిల్లా వాసులు భయపడిపోతున్నారు. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్ ఫ్లూగా నిర్ధారణ కావడంతో ఒకింత కలవరపాటుకు గురవుతున్నారు. ముక్క ముట్టెందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో చికెన్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి.
పడిపోయిన చికెన్ విక్రయాలు
జిల్లాలో లేయర్ 45 లక్షలు, బ్రాయిలర్ 53.25 లక్షలు, లింగాపురం 1.10 లక్షల కోళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 60 శాతం మేర జిల్లాకు సరఫరా అవుతున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి చికెన్ విక్రయాలు 50 శాతానికి పైగా పడిపోయాయి. తిరుపతి లీలామహల్ కూడలిలోని ఓ చికెన్ దుకాణంలో రోజుకు 200 కిలోల చికెన్ విక్రయించేవారు. అయితే రెండు రోజులుగా 100 కిలోలు కూడా అమ్ముడుపోవడం లేదని దుకాణదారుడు వాపోయా డు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కోడి రూ.50 లెక్కన, మరికొన్ని ప్రాంతాల్లో కిలో రూ.140కే విక్రయిస్తున్నారు.
ఎలాంటి భయాందోళన వద్దు
బర్డ్ ఫ్లూ వైరస్ మన ప్రాంతంలో ఎక్కడా లేదు. ఈ వైరస్ పట్ల ప్రస్తుతం ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదు. పశు సంవర్థక శాఖ ఇప్పటికే దీనిపై పలు ఆదేశాలు జారీచేసింది. వలస పక్షుల కారణంగా ఈ వైరస్ వ్యాప్తికి కారణమైందని నిర్ధారించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో దీని ప్రభావం ఉంది. రాష్ట్రంలో మరెక్కడా బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు. ఈ వైరస్ గురించి ఆలోచన చేయడం అనవసరం. చికెన్ బాగా ఉడకబెట్టి తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
– డాక్టర్ నాగేంద్ర రెడ్డి , వెటర్నరీ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్
అమ్మకాలు తగ్గాయి
గడిచిన మూడు రోజులుగా చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రోజున మరింతగా విక్రయాలు తగ్గడం వాస్తవమే. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండు రోజులుగా చికెన్ దుకాణాలు వేలవేలబోతున్నాయి. ఈ వైరస్ ఎఫెక్ట్ మనకు లేకపోయినా భయంతో ఎవరూ ముందుకు రావడం లేదు.
– కృష్ణమూర్తి, గోవర్ధన్ చికెన్ సెంటర్ నిర్వాహకులు, తిరుపతి
ముక్క ముట్టాలంటే భయం!
ముక్క ముట్టాలంటే భయం!
ముక్క ముట్టాలంటే భయం!
Comments
Please login to add a commentAdd a comment