నేడు త్రిశూల స్నానం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకులకు ముందు మాఘపౌర్ణమిన త్రిశూన స్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో మహాశివరాత్రి ఉత్సవాలకు నాందిగా భక్తులు భావిస్తారు. ఈ మేరకు స్వర్ణముఖి నదిలో సద్యోముక్తి క్షేత్రంలో త్రిశూల స్నానం కోసం తొట్టెను ఏర్పాటు చేశారు. అదే సమయంలో భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు వంటివి కూడా వేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు పంచమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయం నుంచి వేంచేపుగా స్వర్ణముఖి నదిలోని సద్యోముక్తి ప్రదేశానికి తీసుకురానున్నారు. సద్యోముక్తి పురాణ ప్రవచనం అనంతరం త్రిశూల స్నాన ఘటాన్ని సద్యోముక్తి ప్రదేశంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
ఎస్సీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కోట: బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కోట ఎస్సీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మార్చి 6వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం ఆయా గురుకుల పాఠశాలల్లో సంప్రదించాలని సూచించారు.
పుష్పయాగానికి అంకురార్పణ
రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహాస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి మంగళవారం రాత్రి వేదపండితులు పుష్పయాగానికి అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతారామయ్యస్వామి మాట్లాడుతూ మాఘ పౌర్ణమినాడు స్వామివారికి పుష్పయాగం చేయడం దేవస్థాన ఆచారమన్నారు. అనంతరం అనుజ్ఞ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మత్సంగ్రహణం, అంకురార్పణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రాక్టికల్స్‌కు 120 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : సీనియర్ ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లలో నిర్వహించిన ప్రాక్టికల్స్‌కు 120మంది గైర్హాజరయ్యారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 94 పరీక్ష కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్స్‌కు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 4,861మంది హాజరుకావాల్సి ఉండగా వారిలో 81 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 94 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రాక్టికల్స్‌కు 4,319 మందికి గాను 39 మంది గైర్హాజరైనట్టు ఆర్‌ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment