భక్తిభావం విలసిల్లాలి
బిషప్ డేనియల్ దంపతులు, మెథడిస్టు జాతర ప్రారంభం
మొదటి రోజు ప్రత్యేక ప్రార్థనలు ● వెలసిన దుకాణాలు
ధారూరు: ధారూరు మెథడిస్టు క్రిస్టియన్ జాతరను మంగళవారం బిషప్ ఎంఏ డేనియల్, ఆశా డేనియల్ దంపతులు ప్రారంభించారు. ప్రధాన ద్వారం పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన ఏసుక్రీస్తు శిలువ వద్దకు చేరుకొని కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. అనంతరం ఏసుప్రభువును స్తుతిస్తూ పాటలు పాడారు. ఆ తర్వాత ప్రధాన శిలువ వద్దకు ఊరేగింపుగా వెళ్లి ప్రార్థనలు చేశారు. బిషప్ దంపతులకు జాతర కార్యదర్శులు దయానంద్, స్టీవెన్, జాతీయ లే లీడర్ ఇమానియల్ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో బిషప్ ఎంఏ డేనియల్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం నవంబరులో జరిగే ఏసుక్రీస్తు జాతరకు మీరంతా సహకరించడం అభినందనీయమన్నారు. ఈ జాతరను 1922 నుంచి ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 102 వసంతాలకు చేరిందని వివరించారు. జాతరకు వచ్చే యాత్రికులకు ఏసుక్రీస్తు ప్రబోధనలను వినిపించి వారిలో భక్తి కలిగేలా చేయాలని అన్నారు. క్రీస్తును మనసా, వాచా నమ్మి ప్రార్థిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని తెలిపారు. కార్యక్రమంలో రెవరెన్ మార్క్ డీఎస్, హెచ్‌ఆర్‌సీ గ్యాబ్రియల్, ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధికారులు, కాన్ఫరెన్ లే లీడర్లు, కాన్ఫరెన్స్ కోశాధికారులు, పాస్టర్లు, యాత్రికులు పాల్గొన్నారు.
తరలివచ్చిన పాస్టర్లు
మొదటిరోజు జాతరకు దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పాస్టర్లు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జాతరలో దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆర్కెస్ట్రా బృందం సభ్యులు ఏసుక్రీస్తు పాటలు పాడారు.
Comments
Please login to add a commentAdd a comment