ఇబ్రహీంపట్నం రూరల్: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సూసైడ్ లేఖ రాసిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కన చెట్టుకు ఉరి వేసుకొని కుళ్లిన స్థితిలో ఓ మృతదేహాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐ బాలరాజు వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏడెనిమిది రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. చుట్టు పక్కల వెతికినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి ప్యాంట్ జేబుల్లో వెతకగా బీడీలు, అగ్గిపెట్టెతో పాటు ఒక కవర్‌లో లేఖను గుర్తించారు. తన చావుకు తీవ్రమైన కడుపునొప్పి కారణమని అందులో రాసి ఉంది. పక్కనే కుమార్తె ఉమ సెల్‌ఫోన్ నంబరు కూడా ఉండటంతో పోలీసులు సమాచారం ఇచ్చారు. వివరాలు ఆరా తీయగా.. మృతుడు నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామానికి చెందిన పోల్‌రెడ్డి సుదర్శన్‌రెడ్డి(56)గా గుర్తించారు. నల్లమల్ల అపార్ట్‌మెంట్ ప్రముఖ్ టౌన్‌షిప్‌లో తన బిడ్డ వద్ద ఉండేవాడని తెలుసుకున్నారు. బోర్‌వెల్‌పై పని చేస్తూ పది రోజులకోసారి ఇంటికి వచ్చేవాడని తెలిపారు. వారం క్రితమే ఇంటి నుంచి వెళ్లినట్లు చెప్పారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు వివరించారు.
కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా..
సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్న వ్యక్తి
ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కన కుళ్లినస్థితిలో మృతదేహం గుర్తింపు
నల్లగొండ జిల్లా వాసిగా నిర్ధారణ
Comments
Please login to add a commentAdd a comment