దిగుబడి.. దిగులు
● పత్తిలో తగ్గిన పంట ఉత్పత్తులు
● మద్దతు ధర ఆశాజనంగా ఉన్నా నష్టాలు
● మరోవైపు వేధిస్తున్న కూలీల కొరత
● పెట్టుబడులు సైతం రావట్లేదని రైతుల ఆందోళన
మోమిన్‌పేట: ప్రస్తుత ఖరీఫ్ పంటలపై రైతుల ఆశలు ఆవిరయ్యాయి. అధిక వర్షాలతో పంటల ఎదుగుదల లేకపోవడం.. వాటిపై ఆశిస్తున్న వైరస్‌లతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలంలో పత్తి సాగు గణనీయంగా పెరిగినా దిగుబడులు తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తే మహా గొప్పని ఆరుగాలం శ్రమించిన అన్నదాతలు వాపోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు సైతం రావని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.7,521లు ప్రకటించడం హర్షణీయమే అయినా, సరైన దిగుబడులు లేక కర్షకులు దిగాలు చెందుతున్నారు.
17 వేల ఎకరాల్లో సాగు
బహిరంగ మార్కెట్‌లో కూడా తెల్ల బంగారానికి మంచి రేటు పలుకుతుందని రైతులు ఆశించారు. మండలంలో 17వేల ఎకరాలలో పత్తిని సాగు చేశారు. ఖరీఫ్ మొదట్లో వర్షాలు సక్రమంగా కురిశాయి. కాయ, పిందె సమయంలో అధిక వర్షాలు పంటను పూర్తిగా దెబ్బతీశాయి. పెట్టుబడులు పెరగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ ఎదురు కాని పరిస్థితులు ప్రస్తుత ఖరీఫ్‌లో ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఖరీఫ్ పంటలు నాశనం కావడం.. వర్షాలు కురవడంతో రబీలో పంటలు పండే అవకాశం ఉన్నా కూలీల కొరత పట్టి పీడిస్తుందని మదనపడుతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
కిలోకు రూ.15లు ఇచ్చినా కూలీలు దొరకడం గగనమైందని రైతులు వాపోతున్నారు. రోజుకు రూ.450లు ఇస్తే కూడా 10 నుంచి 12 కిలోలు పత్తి తీయడం లేదంటున్నారు. ఎటు చూసిన కూలీల కొరత కొట్టోచ్చినట్లు కన్పిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రిత వ్యవసాయ విధానంతో ప్రతి కుటుంబం పత్తి పంటనే సాగు చేస్తున్నారు. ఖరీఫ్ రైతులను తీవ్ర అప్పుల ఊబిలోకి నేట్టి వేసిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ప్రారంభించిన ఖరీఫ్ నేడు నిరాశకు గురి చేసిందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం రైతు భరోసాను అందించి పత్తి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈసారి ముంచింది
కౌలుకు తీసుకొన్న ఏడు ఎకరాల్లో పత్తి సాగు చేశా. విత్తనాలు విత్తుకొనే మొదలు ఇప్పటి వరకు రూ.రెండు లక్షలు పెట్టుబడి పెట్టా. అధిక వర్షంతో మొక్క మీటరు ఎత్తు కూడా పెరగలేదు. పది కాయలు మాత్రమే వచ్చాయి. అప్పుడే ఎండాకు తెగులు సోకి ఆకులు రాలిపోయాయి. కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్నాం. ఈసారి పత్తి పూర్తిగా ముంచింది.
– ఆనందం, కౌలు రైతు, ఎన్కేపల్లి
మూడు క్వింటాళ్లే
నాకున్న ఐదు ఎకరాలలో పత్తిని సాగు చేశా. మొక్కకు 10 కాయలు వచ్చాయి. అధిక వర్షాలు కురవడంతో ఎకరాకు మూడు క్వింటాళు్‌ల్ వచ్చింది. దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొంది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు.
– నజీర్ అహ్మద్, రైతు, ఎన్కేపల్లి
Comments
Please login to add a commentAdd a comment