కనుల పండువగాధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
యాలాల: మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం గురువారం కనుల పండువగా నిర్వహించారు. మధ్యాహ్నం మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అదే సమయంలో గ్రామ నాభిశిల(బొడ్రాయి) ప్రతిష్ఠాపన సైతం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ నిర్వహించారు. మూడు రోజులుగా ప్రతిష్ఠాపన మహోత్సవాలను ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు విజయవంతంగా చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పేరి రాజేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ భక్తులు పాల్గొన్నారు.
పులుమద్దిలో టీజీఐఆర్డీ బృందం పర్యటన
అనంతగిరి: వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామాన్ని గురువారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(టీజీఐఆర్డీ) బృందం సందర్శించింది. శిక్షణలో భాగంగా గ్రామంలో పర్యటించామని వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్‌డబ్ల్యూఎం షెడ్, సీసీ రోడ్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, నర్సరీ, పార్కు, క్రీడా ప్రాంగణం గ్రామ పరిసరాలు తదితర వాటిని పరిశీలించారు. స్థానిక అధికారులతో నిర్వహణ ఎలా చేస్తున్నారు. ఏ నిధులతో చేశారు తదితర వాటిపై ఆరా తీశారు. వీరివెంట ఎంపీడీఓ వినయ్‌కుమార్, ఎంపీఓ దయానంద్, ఏపీఓ శీను, ఈసీ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహిళ అదృశ్యం
మీర్‌పేట: కుమారుడి ఇ ంటికి వచ్చిన మహిళ అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూల్ జిల్లా డోన్ మండలానికి చెందిన లక్ష్మీదేవి(50) ఈ నెల 16వ తేదీన మీర్‌పేట నందనవనంలో నివాసముండే కుమారుడి ఇంటికి వచ్చింది. 18వ తేదీన ఉదయం ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు గురువారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ వాహనం ఢీకొని.. వ్యక్తికి తీవ్ర గాయాలు
షాద్‌నగర్‌రూరల్: మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. గురువారం ఆయన షాద్‌నగర్ నుంచి పాతజాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో ఫరూఖ్‌నగర్‌కు చెందిన జంగయ్య హైదరాబాద్ రోడ్డులో స్కూటీపై వెళుతూ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి కారు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జంగయ్యను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి సురక్షితంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment