ప్రమాదంలో అనంతగిరి
వికారాబాద్ అర్బన్: కార్తీక పురాణంలో పేర్కొన్న అనంతగిరులకు అన్యమత ప్రమాదం పొంచి ఉందని, అతి త్వరలోనే ఈ ప్రాంతాన్ని వక్ఫ్ బోర్డు ఆక్రమించే దుస్థితి దాపురించిందని హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు లలిత్‌కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా అనంతగిరికి వచ్చిన ఆయన కార్తీక మాస ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. దురాశతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను వక్ఫ్ బోర్డు పేరిట కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. పవిత్రమైన అనంతగిరి క్షేత్రంలో అనుమతి లేకుండా ఓ మతానికి చెందిన స్కూల్‌ను నడుపుతుంటే అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమిళనాడు, తిరుఛద్దూర్, శబరిమలై, ముంబై సిద్ధివినాయక టెంపుల్ మాదిరిగానే అనంతగిరి పద్మనాభస్వామి ఆలయానికి సైతం వక్ఫ్ బోర్డు ప్రమాదం పొంచి ఉందన్నారు. మూసీ ప్రక్షాళనను హైదరాబాద్ నుంచి కాకుండా.. అనంతగిరి నుంచి చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్‌లోని పద్మనాభస్వామి ఆలయ పుష్కరిణి చుట్టూ ఉన్న పాలగుండం, నెయ్యిగుండం, తేనెగుండం, కాశీనుంచి ఉద్భవించిన గంగాజలంతో కలియుగ తీర్థంగా ఉన్న మూసీ అనంతగిరి నుంచి హైదరాబాద్ మీదుగా నల్లగొండ జిల్లాలో సంపూర్ణంగా పారుతూ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోందని తెలిపారు. ఇంత పవిత్రమైన జలాల కోనేరులకు తాళం వేసి, మురుగు నీటిగా మార్చిన ఘనత ఆలయ నిర్వాహకులదేనని ఆరోపించారు. కొండల్లో వెలిసిన అనంతపద్మనాభ స్వామి ఆలయానికి ఒక్క గుంట భూమి కూడా లేదని, ఆలయ ఈఓ, ప్రధాన అర్చకుడు, అటవీ, ఎండోమెంట్ అధికారులు తెలపడం బాధాకరమైన విషయమన్నారు. భక్తులు, దాతలు సమర్పించిన కానుకలను ఇతర ఖర్చులకు ఉపయోగిస్తూ ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హిందూ జనశక్తి అధ్యక్షుడు శ్రీనివాస్, ధార్మిక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ భూములుఅన్యాక్రాంతమయ్యే పరిస్థితి
హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు లలిత్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment