అక్రమ కేసులు ఎత్తివేయాలి
● భూములు ఇవ్వమన్నందుకేరైతులను జైల్లో పెట్టారు ● పంట పొలాలే వారికి జీవనాధారం ● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ● బాధితులకు పరామర్శ..అండగా ఉంటామని హామీ
దుద్యాల్: ‘ఈ ప్రాంత గిరిజనులకు భూములే జీవనాధారం.. అలాంటి పొలాలను లాక్కోవాలని చూశారు.. భూములు ఇవ్వమన్నందుకే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపారు’ అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. లగచర్ల ఘటనలో బెయిల్‌పై వచ్చిన రైతులను సోమవారం ఆమెపరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు పోతాయంటే ఎవ్వరికై నా బాధ ఉంటుందన్నారు. రైతుల అంగీకారం లేకుండా ఒక్క గుంట భూమి కూడా తీసుకోవడానికి వీలు లేదన్నారు. పచ్చటి పొలాలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో అమాయక రైతులపై కేసులు పెట్టారని ఆరోపించారు. జైలులో వారిని చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. రైతుల అభిప్రాయం మేరకే పనులు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. జైలులో ఉన్న మిగిలిన వారిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి అధికారాలు నీ చేతిలోనే ఉన్నాయి.. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ఎత్తివేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బాధిత రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం గిరిజనులతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని సూచించారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ.. జైలులో ఉన్న తమ వారిని విడిపించాలని ఎంపీ డీకే అరుణ కాళ్లమీద పడి వేడుకున్నారు. నెల రోజులుగా అనేక బాధలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నారాయణపేట్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బంటు రమేశ్, నాయకులు ప్రతాప్ రెడ్డి, మల్లయ్య, మణికంఠ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment