‘ప్రైవేట్’ మాయ
పరిగి: పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ లక్షల రూపాయాలు దండుకుంటున్నారు. క్లినిక్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో అందిస్తున్న వైద్య సేవలు, టెస్టులు, వాటి ధరల వివరాలను ఆస్పత్రి ఆవరణలో బోర్డుపై ప్రదర్శించాలి. కానీ ఎక్కడా ఈ విధానం అమలు కావడం లేదు. డాక్టర్ల పేరు చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.
పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆస్పత్రులు
పరిగి పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. పట్టణంలో ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఈఎన్‌టీ, కంటి తదితర విభాగాలకు చెందిన ఆస్పత్రులు ఉన్నాయి. పదుల సంఖ్యలో ఆస్పత్రులు ఉన్నా చాలా వాటికి అనుమతులు లేవు. రోగి ఆస్పత్రికి వస్తే చాలా వేలల్లో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టానుసారంగా టెస్టులు చేయించి.. మందులు రాసి వేల రూపాయాలు వసూలు చేస్తున్నారు. సాధారణ జ్వరం వచ్చిన వారికి కూడా డెంగీ, టైఫాయిడ్, మలేరియా తదితర రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తూతూమంత్రంగా తనిఖీలు
ఇటీవల పట్టణంలో జిల్లా వైద్య శాఖ అధికారులు పలు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు.చాలా వాటికి సరైన అనుమతులు లేవని గుర్తించారు. ఓ ఆస్పత్రికి సీజ్ చేశారు. మరో నాలుగు హాస్పిటల్స్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ మరుసటి రోజు నుంచే క్లినిక్‌లలో చికిత్సలు నిర్వహించడం కనిపించింది. వైద్య శాఖ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేపట్టి మమా అనిపించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆస్పత్రుల జోలికి వెళ్లొద్దని ఓ నాయకుడు అధికారులను హెచ్చరించినట్లు సమాచారం.
ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు
చిన్నపాటి జ్వరం వచ్చినా అన్ని రకాల పరీక్షలు
నామమాత్రపు తనిఖీలతోసరిపెడుతున్న అధికారులు
చర్యలు తీసుకుంటాం
అనుమతి, అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహించినా, చికిత్సలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. పరిగిలో ఇటీవల తనిఖీలు చేపట్టి ఓ క్లినిక్‌ను సీజ్ చేశాం. అలాంటి వాటిని మళ్లీ తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. లేకుంటే చర్యలు తప్పవు.
– జీవరాజ్,
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వికారాబాద్
Comments
Please login to add a commentAdd a comment