పురం.. నిశ్శబ్దం!
● జనవరి 26తో ముగియనున్న మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు
● జీహెచ్‌ఎంసీలో విలీనం ఉండబోదని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన
● అయినప్పటికీ అధికారిక ప్రకటన రాకపోవడంతో వీడని ఉత్కంఠ
● రాజకీయంగా నెలకొన్న స్తబ్ధత
తుర్కయంజాల్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పదవీకాలం జనవరి 26వ తేదీతో ముగియనుంది. దీంతో యథావిధిగా కొనసాగుతాయా లేక జీహెచ్‌ఎంసీలో విలీనం అవుతాయా అనేది అధికారికంగా తేలాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఔటర్ లోపలి కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేయాలని భావించింది. ఈ దిశగా కసరత్తు కూడా కొనసాగించిన విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మొత్తం ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీగా మార్చనున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గ్రేటర్‌ను విడగొట్టి 3, 4 కార్పొరేషన్‌లు చేయడం లేదని చెప్పడంతో కొంత స్పష్టత వచ్చిందని అంతా అనుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంతో అందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది.
3 కార్పొరేషన్‌లు, 12 మున్సిపాలిటీలు
జిల్లాలో మీర్‌పేట, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్‌లు, తుర్కయంజాల్, ఆదిబట్ల, పెద్ద అంబర్‌పేట, జల్‌పల్లి, మణికొండ, నార్సింగి, శంషాబాద్, తుక్కుగూడ, ఆమనగల్లు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండగా.. ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లి, షాద్‌నగర్ బయట ఉన్నాయి. అన్ని పాలకవర్గాల పదవీకాలం వచ్చేనెల 26తో ముగియనుంది. ఇప్పటికే జిల్లాలోని పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఒకవేళ విలీనం లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సైతం ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోలేదు.
కొనసాగుతున్న స్తబ్ధత
పదవీకాలం ముగిసే ఆరు నెలల ముందు నుంచే ఆశావహులతో రాజకీయ వాతావరణం వేడెక్కేది. కానీ గ్రేటర్‌లో విలీనం అనే వార్తలు ప్రచారం కావడం.. అధికారులు కూడా దానికి తగ్గట్లుగా గతంలో సంకేతాలు ఇవ్వడంతో పదవీ కాలం ముగుస్తున్నప్పటికీ రాజకీయ వాతావరణం స్తబ్ధుగా ఉండిపోయింది. పోటీలో నిలవాలనుకునే వారిలో నిరాశ నిండిపోయింది. మరోవైపు గ్రేటర్ పదవీ కాలం గడువు 5 మే 2026 వరకు ఉండడంతో ఇప్పట్లో ఎన్నికలు ఉండవనే భావన చాలా మందిలో నెలకొంది. విలీనంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే ఈ స్తబ్ధత మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment