చూసుకునేవారు లేక.. ఆస్పత్రిలో చేర్చుకోక..
● మధుమేహం వ్యాధితోపరిగి ప్రభుత్వ దవాఖానాకు రోగి ● కాలికి గాయం.. వైద్యం చేసి బయటకి పంపిన సిబ్బంది ● చెట్టుకింద సేద తీరుతున్న వైనం
పరిగి: ఓ వైపు మధుమేహం వ్యాధి.. ఆపై కాలికి గాయం.. సెప్టిక్ అయ్యి చీము కారుతోంది.. తోడు ఎవరూ లేరు.. ఇన్ని సమస్యలతో ఆస్పత్రికి వచ్చిన రోగికి నామమాత్రం వైద్యం చేసి బయటికి పంపేశారు. రాత్రంతా చలికి వణకిపోతూ.. భోజనం లేక రోగి పడిన బాధలు వర్ణణాతీతం.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పరిగి మండలం రాపోల్ గ్రామానికి చెందిన చాలకి గోపాల్ షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడేళ్ల క్రితం భార్య కూతురితో సహా వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవల కాలుకు గాయం కావడంతో అది కాస్తా పెద్దగా మారి చీము కారుతోంది. బాధ భరించలేక బుధవారం గోపాల్ 108కు కాల్ చేశాడు. సిబ్బంది రోగిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి సిబ్బంది మొక్కుబడిగా వైద్యం చేశారు. గోపాల్‌ను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోలేదు. ఆస్పత్రి బయట ఉన్న చెట్టు కింద ఉండమన్నారు. రెండు రోజులుగా అక్కడే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆకలితో అలమటించాడు. గురువారం ఉదయం అటుగా వచ్చిన విద్యార్థులతో ఆకలిగా ఉందని చెప్పడంతో వారు టిఫిన్ తెచ్చి ఇచ్చారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని, మెరుగైన వైద్యం అందించాలని రోగి కోరారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్‌ను వివరణ కోరగా.. రోగిని ఆస్పత్రిలో చేర్చుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment