సానుకూల వర్షపాతం
వికారాబాద్: ప్రస్తుత యాసంగి సీజన్‌లో వరిసాగు గణనీయంగా పెరిగింది. అంచనాలకు మించి రికార్డు స్థాయిలో నాట్లు వేశారు. ఇప్పటికే సాధారణ సాగు విస్తీర్ణం(93వేల ఎకరాలు) దాటి 1,96,898 ఎకరాలకు చేరుకుంది. నెల పదిహేను రోజులుగా నాట్లు వేసుకోవడంలో రైతన్న బిజీ కాగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సానుకూల వర్షపాతమే ఇందుకు కారణమని వ్యవసాయ శాఖ అఽధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని మించి నమోదు కావడంతో పాటు వానాకాలం చివర (అక్టోబర్, నవంబర్) వరకు వర్షాలు కురిశాయి. దీంతో చెరువుల్లోకి నీరు పుష్కలంగా చేరింది. భూగర్భజలాలు కూడా పెరగడంతో బోరుబావుల్లోనూ నీరు పెరిగి వరి సాగుకు దోహదం చేసింది. ఈ నెల మూడో వారం వరకు నాట్లు కొనసాగే అవకాశం ఉంది. జిల్లాలో అత్యధికంగా పరిగి, కొడంగల్ నియోజకవర్గాలతో పాటు వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని ధారూరు, కోట్‌పల్లి, తాండూరు పరిధిలోని యాలాల్, తాండూరు, బషీరాబాద్ మండాలాల్లో అత్యధికంగా సాగు చేశారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 93 వేల ఎకరాలు కాగా ఈ సారి ఆల్‌టైమ్ రికార్డు నమోదైంది. ఉద్యానవన, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించకపోవడం కూడా వరి సాగు గణనీయంగా పెరగటానికి కారణమని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
418 ఎకరాల్లో ఇతర పంటలు
యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 1,97,316 ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా ఇందులో 1,96,898 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. కేవలం 418 ఎకరాల్లో మాత్రమే ఇతర పంటలు వేశారు. జిల్లాలో 20 మండలాలు ఉండగా 12 మండలాల్లో వెయ్యి నుంచి ఏడు వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. మరింత పెరిగే అవకాశం ఉంది. ఉద్యానవన పంటలు, ఆయిల్ పామ్, ఆలు, పూలు, కూరగాయల సాగు పెంచాలని అధికారులు సూచి స్తున్నా రైతులు అటువైపు ఆసక్తి చూపడం లేదు. ఆ తరహా పంటల సాగుపై అవగాహన లేక వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులు తమ సూచనలు, సలహాలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
వరి సాగుకు అధిక వర్షాలు కారణమని చెప్పవచ్చు. జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని మించి వర్షం పడటంతో చెరువులు నిండుకుండల్లా మారాయి. ప్రధాన ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. జుంటుపల్లి, కోట్‌పల్లి, లఖ్నాపూర్, సర్పన్‌పల్లి, శివసాగర్ ప్రాజెక్టులు అలుగు పారాయి.
విత్తనాల కొరత లేదు
చాలా మంది రైతులు అధిక మోతాదులో ఎరువులు వాడుతున్నారు.. మోతాదుకు మించి వాడితే లాభాల కంటే అనర్థాలే ఎక్కువ.. యూరియా ఎక్కువగా వాడితే పైరు ఎక్కువగా పెరిగి పచ్చగా మారటంతో చీడపీడల శాతం పెరిగి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుత సీజన్‌కు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం.
– మోహన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment