ట్రాక్ లేకుండానే టెస్టులు!
పలుమార్లు నివేదించాం
జిల్లా కేంద్రం వికారాబాద్‌లో డీటీఓ కార్యాలయం, టెస్టు డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుకు 13 ఎకరాల భూమి అవసరం. అది కూడా జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే మంచిది. వికారాబాద్ – అనంతగిరి మార్గంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను కోరాం. సానుకూలంగా స్పందించారు. దాదాపు అక్కడే స్థలం కేటాయించే అవకాశం ఉంది.
– వెంకట్‌రెడ్డి, డీటీఓ
వికారాబాద్: ఇక్కడ అంతా ఈజీ.. డ్రైవింగ్ టెస్ట్ అంతకంటే సులువు.. ఇలా వెళ్లీ.. అలా వస్తే చాలు.. డ్రైవింగ్ టెస్ట్ పాస్.. ఇదీ వికారాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సేవల పరిస్థితి.. ఆదాయం బాగున్నా సొంత భవనానికి నోచుకోవడం లేదు. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా కేంద్రం వికారాబాద్‌లో డీటీఓ(డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్) కార్యాలయం ఏర్పాటు చేశారు. ఏడేళ్లు గడిచినా సొంత భవనం మాట అటుంచితే స్థలం కూడా కేటాయించలేదు. దీంతో అరకొర సౌకర్యాలతో శివరెడ్డిపేట్‌లోని అద్దె భవనంలో కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఓపెన్ ప్లేస్‌లోనే టెస్ట్ డ్రైవింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాల పునర్విభజనకు ముందు పరిగిలో మాత్రమే ఆర్టీఏ యూనిట్ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం వికారాబాద్‌లో ఆర్టీఏ కార్యాలయం, పరిగిలో యూనిట్ కార్యాలయం, తాండూరులో ఎంవీఐ కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. పరిగిలో సొంత భవనం ఉండగా వికారాబాద్, తాండూరులో అద్దె భవనాల్లో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. వికారాబాద్ – అనంతగిరి మార్గంలో ప్రభుత్వం స్థలం ఉండటంతో అక్కడ స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను కోరినట్టు డీటీఓ తెలిపారు. దాదాపు అక్కడే ఖరారయ్యే అవకాశం ఉంది.
పరిగిలో మాత్రమే టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్
జిల్లాలో మొత్తం మూడు చోట్ల ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా ఒక్క పరిగిలో మాత్రమే టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్ ఉంది. వికారాబాద్, తాండూరులో ఓపెన్ ప్లేస్‌లలో డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వికారాబాద్‌లో ఆర్టీఓ కార్యాలయం, టెస్టు డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుకు 13 ఎకరాల స్థలం అవసరమని ఆ శాఖ అధికారులు అంటున్నారు. గతంలో స్థలాలు చూసినా కావాల్సినంత లేక వదిలేశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్రెపల్లి శివారులో 160 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న అధికారులు ఆర్టీఏ కార్యాలయానికి 13 ఎకరాల భూమి కేటాయించ లేకపోయారు.
ఆదాయం ఘనం..
జిల్లాలో వివిధ రకాల వాహనాలు 1.2 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో ఆటోలు 38,903, ద్విచక్రవాహనాలు 38,482 ఉన్నా యి. వీటి ద్వారా ఏటా సగటున రూ.40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు ఆదా యం సమకూరుతోంది. పెట్టుకున్న టార్గెట్‌లో ఏడాదికి 600 నుంచి 700 రెట్ల ఆదాయం అధికంగా వస్తోంది. కానీ సౌకర్యాలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇలా వెళ్ల్లి.. అలా వస్తేడ్రైవింగ్ టెస్ట్ పాస్
ఆర్టీఓ కార్యాలయానికి సొంత భవనం కరువు
ఏడేళ్లుగా ఇదే పరిస్థితి
స్థలం కూడా కేటాయించలేని దుస్థితి
జిల్లాలో వాహనాల సంఖ్య 1.2లక్షలు
ఏటా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ.50 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment