ఆగుతూ.. సాగుతూ..
వికారాబాద్: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు రెండేళ్లు దాటినా భవనం అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు నెమ్మదిగా పనులు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం మారాక కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. వికారాబాద్‌లోని వంద పడకల ఏరియా ఆస్పత్రిని రెండేళ్ల క్రితం జనరల్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. 330 పడకలతో సేవలందించాలని నిర్ణయించారు. ఇందుకు గాను రూ.30 కోట్లు కేటాయించారు. 2023లో వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ కళాశాల ఎదురుగా భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. 2024 నాటికి పనులు పూర్తి చేసి జనరల్ ఆస్పత్రి సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. నేటికీ 80 శాతం పనులే పూర్తి కావడంతో భవనం అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం బస్టాండ్ దారిలో ఉన్న ఏరియా ఆస్పత్రి పాత భవనంలోనే జనరల్ ఆస్పత్రి కొనసాగుతోంది.
330 బెడ్లతో జనరల్ ఆస్పత్రి
రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వికారాబాద్‌కు మెడికల్ కళాశాల మంజూరు చేసిన విషయం తెలిసిందే. వంద సీట్ల సామర్థ్యంతో గత విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించారు. మెడికల్ కళాశాల భవన నిర్మాణం, వసతుల కోసం ప్రభుత్వం రూ.240 కోట్లు మంజూరు చేసింది. అనంతగిరి వెళ్లే దారిలో ఉన్న బిల్ల దాఖలా ఏరియాలో మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటి దాకా అనంతగిరి గుట్టపై టీబీ శానిటోరియం ఆవరణలో నిర్మించిన తాత్కాలిక భవనంలో తరగతులను నిర్వహిస్తున్నారు.
బిల్లులు రాకపోవడంతోనే..
గత, ప్రస్తుత ప్రభుత్వాలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తి చేశారు. అయినా 30 శాతం పనులకే బిల్లులు చెల్లించారని కాంట్రాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వారం రోజులు పనులు జరిగితే ఆ తర్వాత నెలల తరబడి నిలిపేస్తున్నారు. పాత భవనంలో సిబ్బంది, రోగులకు గదులు సరిపోక అవస్థలు పడుతున్నారు. పనులు ఇలాగే సాగితే మరో ఏడాది పట్టినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి జనరల్ ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై తెలంగాణ మెడికల్ ఇన్‌ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డీఈ లక్ష్మీనారాయణను వివరణ కోరగా రెండు మూడు నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసి జనరల్ ఆస్పత్రి సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
రెండేళ్లుగా కొనసాగుతున్న జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణం
ఏడాది క్రితమే 80శాతం పూర్తి
ఆ తర్వాత అడపాదడపా పనులు
బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణం
పాత భవనంలోనే ఆస్పత్రి సేవలు
గదులు సరిపోక రోగుల పాట్లు
Comments
Please login to add a commentAdd a comment