రూ.5 కోట్ల ఆస్తి బుగ్గి పాలు
షాద్‌నగర్: అన్నారం గ్రామ శివారులోని బీఆర్‌ఎస్ ఆయిల్ రిఫైనరీ పరిశ్రమలో మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రూ.5 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఫ్యాక్టరీలోని నూనె శుద్ధి చేసే యంత్రం వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్‌సర్క్యూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, ఆయిల్ ట్యాంకర్‌కు అంటుకోవడంతో పెద్ద శబ్దంతో పేలింది.
విధుల్లో 30 మంది
ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది ఉన్నారు. వివిధ యూనిట్లలో పని చేస్తున్న పలువురు మంటలను గమనించి.. కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. మిగిలిన వారు సైతం బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆయిల్ ట్యాంకర్ పేలిన శబ్దం నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించగా, ఏంజరుగుతుందో తెలియక సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
తీవ్రంగా శ్రమించిన సిబ్బంది
ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న షాద్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో షాద్‌నగర్, జడ్చర్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్ నుంచి మొత్తం ఐదు ఫైరింజన్లు తెప్పించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి బుధవారం తెల్లవారుజామున 5గంటలకు మంటలను పూర్తిస్థాయిలో ఆర్పివేశారు.
పోలీసుల దర్యాప్తు
అనూహ్య ప్రమాదంతో ట్యాంకర్‌లో నిల్వ ఉంచిన ఆయిల్‌తో పాటు, పరిశ్రమలోని పలు యంత్రాలు కాలిపోయాయి. దీంతో రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫ్యాక్టరీ యజమానులు, పోలీసులు తెలిపారు. పట్టణ సీఐ విజయ్‌కుమార్ సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ట్యాంకర్
ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు
కార్మికుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పిన సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment