కొత్త మెనూ అమలు చేయండి
దౌల్తాబాద్: మండలంలో వివిధ గ్రామాల్లో బుధవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ పర్యటించారు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు. బాలంపేట గ్రామంలోని కేజీబీవీని తనిఖీ చేసి వసతులపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ఆదేశించారు. తాగునీటిని ఎప్పటికప్పుడు పరీక్షించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వంట గది, బెడ్స్, ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు ఏ మేర నిధులు అవసరం అవుతాయో అంచనా వేసి పంపాలని అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత తిమ్మాయిపల్లిలో అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. దౌల్తాబాద్‌లో అసంపూర్తిగా ఉన్న గ్రంథాలయ భవనాన్ని పరిశీలించి సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రంథాలయంతో పాటు సైన్స్ క్లబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం బీసీ బాలుర హాస్టల్‌ను తనిఖీ చేసి వసతులపై ఆరా తీశారు. ప్రహరీ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దారు గాయత్రి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎస్‌ఐ రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పనులు వేగవంతం చేయాలి
కొడంగల్: వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. బుధవారం పట్టణంలోని బీసీ, ఎస్సీ వసతి గృహాలను, నర్సింగ్ కళాశాల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. హాస్టళ్ల పరిసరాలు, గదులను పరిశీలించారు. మరమ్మత్తు పనులను గమనించారు. ఇంకా మిగిలి ఉన్న పనులను చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో మాట్రస్ అందజేస్తామని అన్నారు. వసతి గృహాలకు నాణ్యమైన రంగులను వేసి వెలుతురు మంచిగా వచ్చే బల్బులను బిగించాలన్నారు. పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహం ఆవరణలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ తదతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment