నేటి నుంచి రసజ్ఞ జాతీయ నాటకోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రసజ్ఞ జాతీయ నాటకోత్సవాలు

Published Wed, Nov 6 2024 1:34 AM | Last Updated on Wed, Nov 6 2024 1:34 AM

-

మద్దిలపాలెం: స్థానిక కళాభారతిలో బుధవారం(6వ తేదీ) నుంచి శనివారం(9వ తేదీ) వరకు రసజ్ఞ 3వ జాతీయ నాటకోత్సవాలు జరగనున్నట్లు రసజ్ఞ వ్యవస్థాపక అధ్యక్షుడు, నాటకోత్సవాల డైరెక్టర్‌ డాక్టర్‌ వేమలి త్రినాథరావు తెలిపారు. రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ నాటకోత్సవాలు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ సౌజన్యంతో, తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతికశాఖల సంయుక్త నిర్వహణలో జరుగుతాయన్నారు. ఈ ప్రదర్శనలకు అందరూ ఆహ్వానితులేనని వెల్లడించారు.

ప్రదర్శించే నాటకాలు

● తొలి రోజు(6న) మధుర స్వరం తెలుగు నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నాటకాన్ని డి.హేమవెంకటేశ్వరి రచించగా, ఉత్సవ నిర్వాహకుడు, రసజ్ఞ వ్యస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ వేమలి త్రినాథరావు దర్శకత్వం వహించనున్నారు.

● 2వ రోజు(7న) ఎన్‌హెచ్‌–316 ఒడియా నాటకాన్ని అభినయ జాగృతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లోని ఉత్కల్‌ సంగీత మహావిద్యాలయ సభ్యులు పాత్రధారులుగా ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. మాస్‌ ప్రజల్ని ఆడిటోరియంలోకి రప్పించడమే లక్ష్యంగా సామాజిక సందేశాలను వాస్తవికంగా తెలియజేయడంలో ఈ గ్రూప్‌ ప్రసిద్ధి. అజిత్‌దాస్‌ రూపకల్పనలోని ఈ నాటకాన్ని దీపక్‌ రంజన్‌పాటి(అమాన్‌) పర్యవేక్షించనున్నారు.

● 3వ రోజు(8న) దేబాషిష్‌ దత్‌ స్థాపించిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాక్చువల్‌ థియేటర్‌ ఆర్ట్స్‌(ఐఎఫ్‌టీఏ) ఆధ్వర్యంలో స్వీయ దర్శకత్వంలో బెంగాళీ నాటకం ‘కృష్ణ’ను ప్రదర్శించనున్నారు. పాతికేళ్లుగా 50కి పైగా థియేటర్‌ ప్రొడక్షన్లను ఏర్పాటు చేసిన ఘనత ఈ సంస్థది.

● చివరి, 4వ రోజైన 9న దివాకర్‌బాబు మాడభూషి రచించిన భూతకాలం నాటకాన్ని ప్రదర్శించనున్నారు. దీనికి డాక్టర్‌ వెంకట్‌ గోవాడ దర్శకత్వం వహించనున్నారు.

● తెలుగు నాటకాలతోపాటు, ఒడియా, బెంగాళీ నాటకాలు కూడా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement