సింహాచలం: శ్రీ వరహా లక్ష్మీనృసింహ ఆలయంలో సోమవారం రాత్రి ఓ మహిళా ఎస్పీ రుబాబు చర్చనీయాంశమైంది. ఆ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, వైదికులకు, ఆమెకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు రాత్రి 7 గంటలకు ఆపి.. ఆరాధన నిర్వహించడం ఆనవాయితీ. ఆ సమయంలో ఎవరికీ దర్శనాలు లభించవు. అదే సమయంలో మహిళా ఎస్పీ రూ.300 టికెట్టు తీసుకుని దర్శనానికి వచ్చారు. అప్పటికే దివిటీ సేవ జరుగుతోందని, దర్శనాలు నిలుపుచేశామని, భోగమండపంలో తెర కూడా వేసేశామని అక్కడ విధుల్లో ఉన్న వారు ఆమెకు చెప్పారు. ఈ క్రమంలో ఉద్యోగులకు, ఆమెకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి ఒక అర్చకుడు ఆమెను దర్శనానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎస్పీ వెంట వచ్చిన వ్యక్తి ఫోన్ మాట్లాడుతుండగా.. ఆ ఫోన్‌ను ఆలయ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఎస్‌పీఎఫ్ సిబ్బంది తీసుకున్నారు. కాగా.. సెల్‌ఫోన్ తీసుకున్న ఇద్దరు ఎస్‌పీఎఫ్ గార్డులపై వారి ఉన్నతాధికారులకు ఆ ఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరినీ ఆలయంలో విధుల నుంచి తప్పించి.. మరో ఇద్దరిని నియమించినట్లు తెలిసింది. ఈ సంఘటనపై విధుల్లో ఉన్న సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని చెప్పారు. గతంలో తెర వేసిన తర్వాత కూడా పలువురికి దర్శనాలు కల్పించి.. అర్చకులు విమర్శలు పాలైన సంఘటనలు ఉన్నాయి. ఆలయ అధికారులు, అర్చకులు, ఇతర సిబ్బందికి మధ్య సమన్వయం కొరవడటంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment