రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్
● జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ ● సహకరించాలని సీపీ బాగ్చికి విజ్ఞప్తి
డాబాగార్డెన్స్: నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ సమావేశమయ్యారు. జీవీఎంసీ కమిషనర్ చాంబర్‌లో ఇంజినీరింగ్ అధికారులు, ఎన్‌హెచ్‌ఏ ప్రతినిధులు, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ప్రవీణ్‌కుమార్‌తో మంగళవారం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాలు, జంక్షన్లలో ట్రాఫిక్‌కు సంబంధించి సీసీ కెమెరాలు, వీధిలైట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ లైట్లు, చీకటి ప్రదేశాలు, కొత్తగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు, రోడ్ల మరమ్మతులు తదితర సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ సహకరించాలని కోరారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో 1.18 లక్షలకు పైగా వీధి దీపాలు, జంక్షన్లలో లైట్లు ఉన్నాయన్నారు. పనిచేయని వాటికి మరమ్మతులు చేపడుతున్నామని, చీకటి ప్రాంతాలు గుర్తించి అక్కడ కొత్త లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కాంతివంతమైన లైట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించినట్లు చెప్పారు. సీసీ కెమెరాలు, పాదచారుల క్రాసింగ్ సిగ్నల్స్‌లను పునరుద్ధరిస్తామన్నారు. రోడ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు సహకరించాలని సీపీని కోరారు. నగరంలో స్థలాలు గుర్తించి వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని, పలు కూడళ్లలో ట్రాఫిక్ ఐలాండ్‌లు ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ ఆఖరి నాటికి ఈ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ పి.శివప్రసాదరాజు, పర్యవేక్షక ఇంజినీర్లు పీవీవీ సత్యనారాయణరాజు, సంపత్‌కుమార్, కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీధర్, స్మార్ట్ సిటీ అధికారులు, కంట్రోల్ రూమ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హుస్సేన్, ఈస్ట్–2 ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment