అంతా మా ఇష్టం
● సమాంతర చదువుకు చరమగీతం
సొంత ప్రశ్నాపత్రాలతో ప్రయివేటు స్కూళ్లలో పరీక్షలు
● ప్రభుత్వ స్కూళ్లలో ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాలు ● ప్రయివేటు యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం ● నేటి నుంచి ఫార్మెటివ్ పరీక్షలు
విశాఖ విద్య : కూటమి ప్రభుత్వం సమాంతర చదువులకు చరమగీతం పాడుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం సొంత ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించుకునేందుకు అంగీకరించింది. దీంతో పాఠశాల స్థాయిలో పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. జిల్లాలో ఫార్మెటివ్–2(శామ్) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతుండగా.. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 3.44 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్షలు కావడంతో వీటి నిర్వహణపై జిల్లా విద్యాశాఖాధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
ప్రైవేటు స్కూళ్లలో సొంత ప్రశ్నాపత్రాలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో సమాంతర చదువులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్య, శిక్షణ పరిశోధన సంస్థ(ఎస్‌సీఈఆర్టీ) ఆధ్వర్యంలో రూపొందించిన ప్రశ్నాపత్రాలతోనే ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని స్కూళ్లలో ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాలతో ఫార్మెటివ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు సొంతంగా ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసుకొని పరీక్ష నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరించే ప్రైవేటు స్కూళ్లకు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా ప్రశ్నాపత్రాలను సరఫరా చేయనుంది.
మార్కుల మాయాజాలానికి ఊతం
ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల్లో సాధించిన మార్కులను విద్యార్థుల సామర్థ్యానికి కొలమానంగా చూస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అలాంటప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో వేర్వేరు ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించడం వల్ల వాస్తవితకత ఎలా తెలుస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలతో భవిష్యత్‌లో ప్రైవేటు స్కూళ్లకు క్రేజ్ పెరిగి, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు.
జిల్లాలో మొత్తం స్కూళ్లు 1,387
పరీక్షలు రాయనున్న విద్యార్థులు
3.44 లక్షలు
ప్రభుత్వ స్కూళ్లు 546
ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రంతో రాసే
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు 83,336
ప్రైవేటు స్కూళ్లు 841
ఇందులో చదువుతున్న విద్యార్థులు 2,60,664
ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రానికి
అంగీకరించిన ప్రైవేటు స్కూళ్లు 62
ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రంతో
పరీక్ష రాసేవారు 4,240
ఏర్పాట్లు పూర్తి చేశాం
ఫార్మెటివ్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. బుధవారం నుంచి ఈ నెల 8 వరకు జరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరిపడా ప్రశ్నాపత్రాలను డీసీఈబీ ద్వారా ముద్రించి స్కూల్ కాంప్లెక్స్‌లకు అందజేశాం. ఏ రోజుకారోజు అక్కడ నుంచి పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకెళ్లాలి. జిల్లాలోని 62 ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాలు కావాలని అడిగారు. వారికి అందజేస్తాం. పరీక్షల అనంతరం మూల్యాంకనం పూర్తి చేసి, మార్కులను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించాం.
– కృష్ణకుమార్, డీసీఈబీ సెక్రటరీ
Comments
Please login to add a commentAdd a comment