పుస్తక పఠనంతో మనోవికాసం
గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్
డాబాగార్డెన్స్ :పుస్తక పఠనం ద్వారా అజ్ఞానం తొలగిపోతుందని, పేదరికం కనుమరుగవుతుందని, యువతకు బంగారు భవిష్యత్తు సిద్ధిస్తుందని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ అన్నారు. విద్యార్థులు, యువత గ్రంథాలయాలకు రావాలని, పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. సూర్యాబాగ్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రంథాలయాలు మనందరికీ దారిచూపే లైట్ హౌస్‌లు వంటివని అభివర్ణించారు. అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని అదే ప్రాంగణంలోని నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోద్బలం, విద్యాశాఖ మంత్రి సహకారంతో జిల్లాలోని గ్రంథాలయాలను అభివద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి ఆర్‌సీహెచ్ వెంకట్రావు, డివిజనల్ పీఆర్వో డి. నారాయణరావు, స్థానిక ఎంఈవోలు, గ్రంథాలయ సంస్థ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment