జిల్లా విద్యాశాఖలో మూడు ముక్కలాట
విశాఖ విద్య: జిల్లా విద్యాశాఖలో పర్యవేక్షణాధికారులను కుదురుగా నిలవనీయడం లేదు. జిల్లా ఉప విద్యాశాఖాధికారిగా ఆరు నెలల్లోనే ముగ్గురు అధికారులు మారిపోయారు. గోపాలపట్నం ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్న అంబటి సోమేశ్వరరావుకు తాజాగా డిప్యూటీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల చినగదిలి ఎంఈవో రవీంద్రబాబును ఇంచార్జి డీవైఈవోగా నియమించగా, తాజా ఉత్తర్వులతో ఆయన తన మాతృస్థానానికి వెళ్లక తప్పలేదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖలో చోటుచేసుకుంటున్న మార్పులు–చేర్పులు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. భీమునిపట్నం డైట్‌లో సీనియర్ లెక్చరర్ గౌరీ శంకర్ డీవైఈవోగా కొంతకాలం పనిచేయగా, ఆయన ఉద్యోగోన్నతిపై వేరే జిల్లాకు వెళ్లిపోయారు. దీంతో పెందుర్తి ఎంఈవో సువర్ణకు డీవైఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎప్పుడో జరిగిన బడి బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో ఆమెను బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్ చేయటంతో అనివార్యంగా డీవైఈవోగా చినగదిలి ఎంఈవో రవీంద్రబాబుకు అప్పగించారు. ఆయన డీవైఈవోగా బాధ్యతలు తీసుకొని రెండున్నర నెలలు కావొస్తుండగా, ఇంతలోనే గోపాలపట్నం ఎంఈవో అంబటి సోమేశ్వరరావుకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎంఈవోలలో సోమేశ్వరరావు సీనియర్ అని చెబుతుండగా, మరి రవీంద్రబాబును ఎలా ఆ సీట్లో కూర్చొబెట్టారనేది ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. వచ్చే మార్చిలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఓటర్లు నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో కీలకమైన డీవైఈవో పోస్టులో అధికారుల చేర్పులు–మార్పులు చేయడం గమనార్హం. ప్రైవేటు స్కూళ్లు అత్యధికంగా ఉన్న విశాఖ నగరంలో చోటు చేసుకుంటున్న ఇలాంటి వ్యవహారాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం పరిణామాలతో విద్యాశాఖ కార్యకలాపాలపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు.
డీవైఈవోల మార్పుపై సర్వత్రా చర్చ
Comments
Please login to add a commentAdd a comment