‘మినీ గోకులం షెడ్ల నిర్మాణ పనులు వేగవంతం’
సాక్షి, అనకాపల్లి: ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల్లో భాగంగా మంజూరైన సీసీ రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ ఎం. శివ ప్రసాద్ ఆదేశించారు. పెందుర్తి నియోజక వర్గంలో సరిపల్లి, జంగాలపాలెం, పెదగాడి పంచాయతీల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. పల్లె పండగలో భాగంగా మంజూరైన సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. అనంతరం ఉపాధి హామీ పథకంలో మంజూరైన గోకులం షెడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పెందుర్తిలోని జిల్లా సమాఖ్య ప్రాంగణంలో విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యవేక్షక ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు, క్లస్టరు అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అదనపు ప్రొగ్రాం అధికారులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌లతో సమీక్ష నిర్వహించారు. పల్లె పండగలో భూమి పూజ చేసి ప్రారంభించిన సీసీ రోడ్డు, మినీ గోకులం షెడ్లలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆమోదం పొంది ఇంకా పూర్తి కాలేనటువంటి పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
సంక్రాంతి ముందే పూర్తి.. : అనకాపల్లి జిల్లాలో మంజూరైన 1142 సీసీ రోడ్లు, 851 గోకులం షెడ్లను, విశాఖ జిల్లాలో 140 సీసీ రోడ్లు, 151 గోకులం షెడ్లను సంక్రాంతికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన పనులకు ఎఫ్‌పీవోలు జనరేట్ చేస్తే..త్వరగా పేమెంట్ ప్రక్రియ కూడా పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ, అనకాపల్లి జిల్లాల డ్వామా పీడీ ఆర్.పూర్ణిమాదేవి, విశాఖ పంచాయతీ రాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్, డీపీఆర్‌ఈవో వీరన్నాయుడు, అనకాపల్లి, విశాఖ జిల్లాల సబ్ డివిజనల్ ఇంజినీర్లు, ఏపీడీలు, అదనపు ప్రొగ్రాం అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment