ఆర్కిటెక్ట్స్‌కు అవకాశమివ్వాలి
సిటీలు సింగపూర్‌లు కావాలంటే
● దేశంలో నిపుణుల కొరత లేకపోయినా అవకాశాలు సన్నగిల్లుతున్నాయి ● ప్లానింగ్ చట్టంలో మార్పులు చేస్తేనే అద్భుతాలు ● ప్రభుత్వ ప్రాజెక్టులకీ ఆర్కిటెక్ట్స్‌ని వినియోగించడం లేదు ● ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖ చైర్మన్ రాజేష్
ఇంజినీర్లు వేరు..
ఆర్కిటెక్ట్స్ వేరు..
1998 తర్వాత నుంచి ఏఐ ఎక్స్‌పో ప్రారంభించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. 2005 నాటికి ఆర్కిటెక్ట్స్‌లకు గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పుడు సివిల్ ఇంజినీర్లు కూడా ఆర్కిటెక్ట్స్‌లుగా చలామణి అయిపోతున్నారు. ఇది ఆర్కిటెక్ట్ చట్టం ప్రకారం తప్పు. ఇంజినీర్లు బిల్డింగ్ ప్లాన్ ఇవ్వొచ్చు. కానీ..ఆర్కిటెక్ట్స్‌గా చెప్పుకోవడం సరికాదు. సివిల్ ఇంజినీర్లతో కలిసి ఆర్కిటెక్ట్స్‌లు పనిచేస్తేనే మంచి అవుట్‌పుట్ వస్తుంది. ఆర్కిటెక్ట్స్ అంటే ఎవరు, ఇంజినీర్ ఎవరనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కౌన్సిల్ తరఫున నిర్వహించనున్నాం.
సాక్షి, విశాఖపట్నం : దేశ వ్యాప్తంగా చేపట్టే ప్రభుత్వ ప్రాజెక్టులకు నిపుణులైన ఆర్కిటెక్ట్స్‌కు అవకాశాలు కల్పిస్తే.. సిటీలన్నీ సింగపూర్‌లుగా మారతాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖ సెంటర్ చైర్మన్ రాజేష్ నాగుల స్పష్టం చేశారు. దేశంలో ఆర్కిటెక్చర్ నిపుణుల కొరత లేకపోయినప్పటికీ అవకాశాలు మాత్రం సన్నగిల్లుతుండటంతో.. కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ, జనాభాను అంచనావస్తే భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్కిటెక్ట్‌లకు అనూహ్య డిమాండ్ ఉంటుందన్నారు. నగరంలో జరిగిన ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పో (ఏఐ ఎక్స్‌పో)–2024ను రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించిన అవకాశాలు, ప్రస్తుత పరిణామాల్ని ‘సాక్షి’కి వెల్లడించారు.
కెరీర్ అద్భుతంగా ఉంటుంది
బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో ఆర్కిటెక్ట్స్‌కు ఉపాధి రేటు 2020–30 మధ్య అంటే ఈ దశాబ్ద కాలంలో 1% పెరుగుతుందని అంచనా వేశారు. 2030 నాటికి దేశ జనాభా 1.5 బిలియన్లకు చేరుబోతున్న తరుణంలో.. ఇళ్ల నిర్మాణాలు, కార్యాలయ స్థలం, ఇతర మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతూనే ఉంటుంది. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్స్ నుంచి ఆర్కటెక్చర్‌ను అభ్యసించాలనుకుంటే ఏ విద్యార్థికై నా ఈ రంగంలో కెరీర్ వృద్ధి చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా.. దేశంలో పెరుగుతున్న నిర్మాణ పరిశ్రమ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా ఆర్కిటెక్ట్స్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పట్టణీకరణ, స్థిరమైన , ఇంధన–సమర్థవంతమైన భవనాలపై పెరుగుతున్న ఆసక్తి.. ఆర్కిటెక్చర్‌లో అవకాశాల్ని పెంపొందిస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణ సమస్యలపై పెరుగుతున్న అవగాహనతో, భారతదేశంలో స్థిరమైన ఆర్కిటెక్చర్‌కు గణనీయమైన డిమాండ్ ఉంది.
అప్పుడే సిటీలు సింగపూర్‌లుగా మారతాయి
ఆర్కిటెక్ట్స్‌లను వినియోగించుకోకవపోడంతో ఈ కోర్సుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోతోంది. అందుకే దేశ వ్యాప్తంగా ఆర్కిటెక్ట్స్ కాలేజీలు మూతపడుతున్నాయి. ఏపీలో రెండు కాలేజీల్ని మూసేసుకున్నారు. అవకాశాలున్నా వాటిని కల్పించడంలో విఫలమవుతున్నాం. ఉదాహరణకు ప్రభుత్వాలు కూడా ఆర్కిటెక్ట్స్‌ని సరిగా వినియోగించుకోవడం లేదు. కొన్ని ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా ఆర్కిటెక్ట్స్‌ల స్థానంలో సివిల్ ఇంజినీర్లపైనే ఆధారపడుతున్నారు. ఇందులో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఇంకా వెనకబడి ఉంది. 2002లో ఇచ్చిన ప్రభుత్వ జీవో ప్రకారం 300 చ.మీ.కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే ఆ డిజైన్‌పై ఆర్కిటెక్ట్స్ సంతకం ఉండాలనే రూల్ పెట్టారు. 2012 తర్వాత ఆ క్లాజ్‌ని తీసేశారు. అప్పటి నుంచి వీరికి ప్రాధాన్యత రాష్ట్రంలో తగ్గిపోయింది. ఇప్పుడు రెరా చట్టం ప్రకారం 500 చ. గజాల పైన ఉండే ప్రతి ప్లాన్‌పైనా వీరి సంతకం ఉండాలి. దానికి ఆర్కిటెక్ట్స్ అవసరమైనప్పుడు మిగిలిన వాటికి ఎందుకు ఉండకూడదు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాం. ప్రభుత్వ ప్రాజెక్టులకు, 500 చ.గజాలపైన ఉండే ప్రతి భవనానికి ఆర్కిటెక్ట్స్‌ని వినియోగించాలని వినతి పత్రం అందించనున్నాం. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో ఆర్కిటెక్ట్స్‌పైనే ప్రతి ప్రాజెక్టు ఆధారపడి ఉంటుంది. సింగపూర్ లో చిన్న భవనానినైకా ఆర్కిటెక్ట్స్ అవసరం. అలాంటి చట్టాలు తీసుకొస్తేనే మన సిటీలు కూడా సింగపూర్‌లు అవుతాయి.
నైపుణ్యం ఉంది.. అవకాశాలు కల్పించాలి
దేశంలో నిపుణులైన ఆర్కిటెక్ట్స్‌లున్నారు. విశాఖలో 200కిపైగా ఆర్కిటెక్ట్స్‌లున్నారు. శ్రీకాకుళంలో 50 మంది నర్సీపట్నంలో 10 మంది వరకూ ఉన్నారు. ఏపీలో మొత్తంగా 800కిపైగా నిపుణులైన ఆర్కిటెక్ట్స్‌లున్నారు. కానీ అవకాశాలు ఆశించిన మేర రావడం లేదు. 1990ల మధ్యకాలం నుంచి దేశంలో పట్టభద్రులవుతున్న ఆర్కిటెక్ట్స్‌ల సంఖ్య రెట్టింపు అయింది. 1972లో కేవలం 12 ఆర్కిటెక్చర్ ఇన్‌స్టిట్యూట్స్ ఉండగా.. భారతదేశం ఇప్పుడు సుమారు 500 వరకూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 20,000 మంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. అందుకే అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే సత్తా ఏపీ ఆర్కిటెక్ట్‌లకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment