ఆరిలోవ: కేంద్ర కారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే ప్రయత్నంలో జైలు అధికారులకు చిక్కిన ఫార్మాసిస్ట్‌కు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కడియం శ్రీనివాస్ కేంద్ర కారాగారంలో డిప్యూటేషన్‌పై ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. విధుల నిమత్తం శ్రీనివాస్ మంగళవారం జైలుకు వచ్చాడు. జైలు ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది తనిఖీ చేయగా.. ఆయన భోజనం క్యారేజీలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. జైలు అధికారుల ఫిర్యా దుతో ఆరిలోవ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి.. 90 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. బుధవారం అతన్ని కోర్టులో హాజరుపరచగా.. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకొని కోర్టు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేసింది. గంజాయి మొత్తం తక్కువగా ఉండటంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. అయితే, ఈ వ్యవహారంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శ్రీనివాస్ వద్ద 200 గ్రాములకు పైగా గంజాయి లభించినట్లు ఆరోపిస్తున్నారు. స్టేషన్ బెయిల్ కోసం 90 గ్రాములే ఉన్నట్లు శ్రీనివాస్‌కు అనుకూలంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment