అగమ్యగోచరం.. గంగపుత్రుల జీవితం
● ఆదుకోని కూటమి ప్రభుత్వం ● ఒకవైపు భరోసా అందక.. మరో వైపు వరస వాయుగుండాలతో ఇక్కట్లు ● గత వైఎస్సార్ సీపీ హయాంలో మే నెలలోనే భరోసా నిధుల జమ ● నేడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
మహారాణిపేట: రాకాసి అలలను ఎదుర్కొని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల బతుకులు ఎప్పుడే కెరటానికి ఒరిగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. కష్ట కాలంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదు. ఆన్ సీజన్ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా కూడా ఇవ్వడం లే దు. రాయితీ మీద ఇచ్చే ఆయిల్ సబ్సిడీ కూడా పెండింగ్‌లో ఉంది. సముద్రంలో వేట సాగిస్తున్న సమయంలో అగ్నికి ఆహుతి అయిన బోట్లకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీని కోసం మత్స్యకారులు, వారి కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇటీవల తరచూ తుపాన్లు, వానల వల్ల సముద్రంలో వేట సాగలేదు. వేట సాగక.. పూట గడవక మత్స్యకా రులు అల్లాడుతున్నారు. ఇంకో వైపు తరచూ వాయుగుండాలు, అల్పపీడనాలతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
గత ప్రభుత్వంలో ఎంతో మేలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం సకాలంలో అందేది. ప్రతి ఏడాది మత్స్య సంపద సంరక్షణ కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు అంటే 61 రోజుల పాటు సముద్రంలో వేట నిలుపుదల చేస్తారు. ఈ రెండు నెలల పాటు వేట లేకపోవడం వల్ల మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలన్న ఆశయంతో 2019 నుంచి 2023 వరకు అర్హులైన మత్య్సకారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇచ్చారు. 2019లో 18,925 మంది, 2020లో 20,273 మంది, 2021లో 11,193 మంది, 2022లో 11,389 మంది, 2023లో 12,173 మందికి ఈ పథకం వల్ల లబ్ధి కలిగింది.
ఇప్పుడు తూట్లు..
మత్స్యకార భరోసా పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. అధికారం చేపట్టిన తొలి నెల్లోనే ఈ పథకాన్ని హోల్డ్‌లో పెట్టారు. నేటికి ఐదు నెలలు దాటుతున్నా అసలు ఈ పథకం ఉందో లేదో తెలియని అయోమయ స్థితిలో మత్స్యకారులు అల్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జూన్ 15వ తేదీలోగానే భరోసా సొమ్ము మత్స్యకారుల చేతికి అందించేది. కానీ నేడు నవంబర్‌లోకి అడుగు పెట్టినా ఈ పథకం అమలు విషయంపై ఎలాంటి స్పష్టతా లేదు. విశాఖ జిల్లాలో 24 కిలోమీటర్ల తీర ప్రాంతం, 15 మత్స్యకార గ్రామాలు, 30 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 668 మర పడవలు, 1272 మోటారు, 428 సంప్రదాయ ఇంజిన్ లేని తెప్పలకు ఈ పథకం వర్తింపజేశారు. తూర్పు తీరంలో విశాఖ హార్బర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు మత్స్య సంపద పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతోంది. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం కూడా లభిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం తనకేం పట్టనట్లు వ్యవహరించడంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment