పీతల మూర్తి..ఓ తుగ్లక్
సీతమ్మధార: ‘ఆర్థికంగా నష్టపోయాను.. ఇదే నా చివరి అవకాశమని చేతులు కాళ్లు పట్టుకుంటే జీవీఎంసీ ఎన్నికల్లో పీతల మూర్తి యాదవ్‌కు ఓటేశం.. ఆయన గెలిచాక మా చేతిలో బొచ్చు పెట్టి అడుక్కోమంటున్నాడు.’ అని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ 22వ వార్డులో కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దుకాణాలన్నీ ధ్వంసం చేయించడంతో రోడ్డు పాలైన వీధి వ్యాపారులంతా బుధవారం జీవీఎంసీ ఎదురుగా గాంధీ పార్కులో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరు వ్యాపారుల పొట్ట కొట్టిన పీతల మూర్తిని జనసేన నుంచి భర్తరఫ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాయకుల అక్రమాలు గురించి మాట్లాడే పీతల మూర్తి యాదవ్ పెద్ద అక్రమార్కుడని ధ్వజమెత్తారు. పేదల బతుకులను బజారుకీడ్చి.. ఉత్తముడిగా చలామణి అవుతున్న మోసగాడని మండిపడ్డారు.
న్యాయవాది శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ 22వ వార్డులో సామంత రాజులా కార్పొరేటర్ మూర్తి యాదవ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రోడ్లు, వీధి లైట్లు, కాలువలు, పరిశుభ్రత వంటి సమస్యలను వదిలేసి స్థానికుల ఆస్తులపై పడ్డారన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ తీసుకువచ్చిందని గుర్తు చేశారు. పీతల మూర్తి హైకోర్టులో పిటిషన్ వేస్తే, చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని కేంద్రం తీసుకువచ్చిన స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ చూపించాల్సిన బాధ్యత జీవీఎంసీ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. దుకాణాలు తొలగించడం వల్ల సుమారు 300 మంది రోడ్డున పడ్డారన్నారు. వార్డులో ఆల్ఫా టిఫిన్స్, మారుతి ఎలక్ట్రానిక్స్, ఎస్వీఆర్ పండ్ల దుకాణాల లబ్ధి కోసం మూర్తి చిరు వ్యాపారులపై కక్ష కట్టి షాపులను తొలగించారని ఆరోపించారు. పీతల మూర్తిని భర్తరఫ్ చేయాలని, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్‌కు విరుద్ధంగా వ్యవహరించిన జీవీఎంసీ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశానని వెల్లడించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల దుకాణదారులు బొచ్చెలు పట్టుకుని భిక్షాటన చేశారు.
ఆయనకు ఓటేస్తే చేతిలో బొచ్చు పెట్టాడు
ఆగ్రహం వ్యక్తం చేసిన చిరు వ్యాపారులు
Comments
Please login to add a commentAdd a comment