సాక్షి, విశాఖపట్నం:
దాదాపు ఏడాదిన్నర కిందట వరకు రైల్వే వ్యవస్థలో వెలుగు వెలిగిన వాల్తేరు డివిజన్‌కు చీకటి రోజులు దాపురించాయి. డివిజనల్ రైల్వే మేనేజర్‌గా సౌరభ్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి కుంటుపడింది. తన స్వలాభం కోసం మాత్రమే సౌరభ్ పనిచేశారన్న విషయం సీబీఐ దాడులతో సుస్పష్టమైంది. చేయి తడిపితేనే పనులకు పచ్చజెండా ఊపుతామన్న రీతిలో డీఆర్ఎం స్థాయి అధికారి వ్యవహరించడంతో.. అభివృద్ధిలో డివిజన్ వెనుకపడింది. ఆయన స్థానంలో కొత్తగా ఎవరు వస్తారన్న దానిపై ఇప్పుడు అంతటా ఉత్కంఠ నెలకొంది.
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌కు దాదాపు 130 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 21 పాసింజర్ హాల్ట్‌లతో కలిపి మొత్తం 115 రైల్వే స్టేషన్లు డివిజన్ పరిధిలో ఉన్నాయి. సరకు రవాణాతో పాటు ప్రయాణికుల రాకపోకల ఆదాయంలోనూ ఈస్ట్‌కోస్ట్ జోన్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇంతటి చరిత్ర ఉన్న వాల్తేరు రైల్వే పరువును డీఆర్ఎం సౌరభ్‌కుమార్ పట్టాలు తప్పించేశారు. సెంట్రల్ రైల్వే జోన్లో పీసీఎంఈగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన వివాదాస్పదుడిగా పేరొందారు. అక్కడి నుంచి డీఆర్ఎంగా గతేడాది జూలైలో వచ్చిన తర్వాత.. అవినీతి వ్యవహారాలను వేగవంతం చేసేశారు. డివిజన్ పరిధిలో చిన్న టెండర్ కావాలన్నా.. లంచం డిమాండ్ చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.25 వేల నుంచి రూ.కోట్ల వరకూ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందినకాడికి పిండుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కాంట్రాక్టర్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ సౌరభ్‌కుమార్ అనుచరవర్గం బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో డివిజన్ పరిధిలో పనులకు టెండర్లు ఆహ్వానించినా.. ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాల్తేరు పరిధిలో పనులన్నీ నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment