ఈ ఏడాది అనేక మైలురాళ్లు అధిగమించాం
విశాఖపట్నం
పోర్టు చైర్మన్
డా.అంగముత్తు
సాక్షి, విశాఖపట్నం : 2024–25 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) అనేక కీలక, ప్రత్యేక నౌకలను సమర్థవంతంగా నిర్వహించి అనేక మైలురాళ్లను అధిగమించినట్లు చైర్మన్ డా.అంగముత్తు తెలిపారు. యుద్ధ విమానవాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఫిబ్రవరి 21న కంటైనర్ టెర్మినల్‌లో బెర్తింగ్ చేసి.. భారీ నౌకలను సైతం అద్భుతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 29న ఎంవీ స్టార్ యాస్పిరేషన్ అనే 38 మీటర్ల బీక్ నౌకని ఇన్నర్ హార్బర్‌లో బెర్తింగ్ చేసి పోర్టు చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రాత్రి పూట బెర్తింగ్ చేశామన్నారు. భారత నౌకాదళం కోసం హిందూస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన అతిపెద్ద ఫ్లోటింగ్ డాక్‌ని మొదటిసారిగా షిప్‌యార్డ్ బిల్డింగ్ డాక్ నుంచి షిప్‌యార్డు వెట్ బేసిన్‌కు విజయవంతంగా తరలించడం ద్వారా ఒక కీలక ఘట్టాన్ని సాధించామని పేర్కొన్నారు. అదేవిధంగా రాత్రి వేళ పూర్తిగా లోడెడ్ కేప్ నౌకలను వీజీసీబీ వద్ద తొలిసారిగా నిర్వహించామన్నారు. పోర్టు ఆధునికీకరణ పనులను కూడా విజయవంతంగా చేపడుతున్నామని తెలిపారు. ఈక్క్యూ–6, డబ్ల్యూక్యూ–4,5 బెర్త్ డ్రాఫ్ట్‌ని 11 మీటర్ల నుంచి 11.5 మీటర్లకు, వీసీటీపీఎల్ బెర్త్‌ని 15 నుంచి 16 మీటర్లకు పెంచినట్లు వివరించారు. పైలట్ల కొరత ఉన్నప్పటికీ అనేక నౌకలను విజయవంతంగా నిర్వహించి కీలక విజయాలను సాధించామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment