మహారాణిపేట: పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు.జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు, ఉత్పత్తి దారులు ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొంది మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. శుక్రవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియల్ యూనియన్ల, అసోసియేషన్ ప్రతినిధులతో జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా కృషి చేయనున్నామన్నారు. పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలుగా సహకరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ఎటువంటి పరిశ్రమలను స్థాపిస్తే ఉపయుక్తంగా ఉంటుందో జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియల్ యూనియన్ల, అసోసియేషన్ ప్రతినిధులు తమ సూచనలు, సలహాలు అందించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి. ఆదిశేషు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.మురళీ మోహన్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment