ఉలిక్కిపడ్డ గాజువాక
● డయేరియాతో 19 మందికి అస్వస్థత ● ఆస్పత్రిలో చేరిన బాధితులు ● తాగునీటి కలుషితంతో సంఘటన ● సాయిరామ్‌నగర్‌లో 24/7 వైద్య శిబిరం ● నీటి సరఫరా ఈఈకి షోకాజ్ నోటీసు ● ఎమినిటీ కార్యదర్శి సస్పెన్షన్‌కు ఆదేశం
గాజువాక : గాజువాకలో డయేరియా ప్రబలింది. జీవీఎంసీ సరఫరా చేస్తున్న తాగునీరు పైప్‌లైన్ లీకై మురుగునీరులో కలవడంవల్ల ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. 67వ వార్డు సాయిరామ్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటనతో గాజువాక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. డయేరియా కారణంగా 19 మంది అస్వస్థతకు గురైనట్టు కొత్త గాజువాక అర్బన్ పీహెచ్‌సీ వైద్యాధికారి ఫెల్వియా మోనికా తెలిపారు. వారిలో పల్లా పద్మావతి (54) స్టీల్‌ప్లాంట్ జనరల్ ఆస్పత్రిలోను, బగ్గం త్రివేణి (35) స్థానిక ఆర్కే ఆస్పత్రిలోను చికిత్స పొందుతున్నారు. మిగిలినవారు ఇళ్లవద్దే చికిత్స తీసుకొంటున్నారు. తాగునీరు కలుషితంతో ఈ వ్యాధి ప్రబలినట్టు జీవీఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. సాయిరామ్‌నగర్‌లోని మురుగునీ టి కాలువకు ఆనుకొని నీటి పైప్‌లైన్ ఉంది. కొద్దిరోజుల క్రితం పైప్‌లైన్ లీకై నీరు మురుగునీటి కాలువలో కలుస్తోంది. అదే సమయంలో మురుగునీరు కూడా పైప్‌లైన్‌లోకి వెళ్లిపోతోంది. నివాసులు అదే నీటిని తాగుతుండటంతో వాంతులు, విరేచనాలకు గురైనట్టు అధికారులు తెలిపారు. డయేరియా విషయం తెలుసుకున్న జీవీఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పారిశుధ్య విభాగం సిబ్బంది ఆ ప్రాంతంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కాగా, కొత్త గాజువాక అర్బన్ పీహెచ్‌సీ సిబ్బంది 24/7 వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సంఘటన వెలుగు చూసిన వెంటనే జీవీఎంసీ సిబ్బంది నీటి ట్యాంకులద్వారా తాగునీటిని సరఫరా చేశారు. సాయిరామ్‌నగర్‌లో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, నీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.వెంకటరావుకు షోకాజ్ నీటీసు జారీ చేయాలని, వార్డు ఎమినిటీ కార్యదర్శి బొడ్డేటి నవీన లక్ష్మిని విధులనుంచి సస్పెండ్ చేయాలని ఆయన జోనల్ కమిషనర్ శేషాద్రిని ఆదేశించారు.
రంగుమారిన నీళ్లు
పైప్‌లైన్లు ఎక్కడికక్కడ లీకై పోతున్నాయి. దీనివల్ల చాలాసార్లు రంగుమారిన నీళ్లు వస్తుంటాయి. ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. దీనివల్ల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు పట్టించుకోవాలి.
– సాహు సుమిత్ర, సాయిరామ్‌నగర్
అధికారుల నిర్లక్ష్యం
తాగునీటి సరఫరా విషయంలో అధికారులు తొలినుంచీ నిర్లక్ష్యంగా ఉన్నారు. నీరు శుభ్రంగా ఉండటంలేదని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు ఈ సంఘటన చూడాల్సి వచ్చింది. – జామి జగన్నాథరావు,
సాయిరామ్‌నగర్
●
Comments
Please login to add a commentAdd a comment