‘స్థాయీ’ సంఘంలో విభేదాలు
● కోరం లేక సమావేశం వాయిదా ● ఇద్దరు కార్పొరేటర్లకే అభివృద్ధి పనుల కేటాయింపుపై విమర్శలు ● అందుకే డుమ్మా కొట్టిన సభ్యులు..!
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం కోరం లేక వాయిదా పడింది. సభ్యుల్లో లుకలుకలు తారాస్థాయికి చేరుకొన్నాయి. పది మంది సభ్యుల్లో కేవలం ఇద్దరు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు వివరణ ఇచ్చేందుకు అన్ని జోనల్ కార్యాలయాల నుంచి అధికారులు హాజరుకాగా..కోరం లేక సమావేశం వాయిదా వేసినట్టు నగర మేయర్, స్థాయీ సంఘం చైర్‌పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్థాయీ సంఘ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించేందుకు స్థాయీ సంఘ చైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు (గల్లా పోలిపల్లి, శరగడం రాజశేఖర్) సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 11.30 గంటలైనా మిగిలిన సభ్యులు రాకపోడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేసినట్టు హరి వెంకటకుమారి తెలిపారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో చెబుతామన్నారు.
మళ్లీ ఆ ఇద్దరికే..
స్థాయీ సంఘంలో సభ్యులందరూ టీడీపీ వారే అయినప్పటికీ..పార్టీలో హీరోలుగా చలామణి అవుతున్న ఇద్దరు..ముగ్గురు కార్పొరేటర్లకే కోట్లాది రూపాయల పనులు కేటాయిస్తున్నారని, మిగిలిన వారికి మొండి చేయి చూపుతున్నారంటూ ఈ నెల 8న జరిగిన స్థాయీ సమావేశంలో పలువురు సభ్యులు మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూ.కోట్ల విలువైన పనులు అన్ని వార్డుల్లో జరిగాయని, సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా..ఆ ఇద్దరు..ముగ్గురుకే తప్పా..మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందంటూ ఆ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన సమావేశంలో కూడా ఆ ఇద్దరు కార్పొరేటర్లకు అనుకూలంగా పలు అంశాలు పొందుపరచడంతో మిగిలిన సభ్యులు డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. టీడీపీ కార్పొరేటర్లలో ఇద్దరికి సుమారు రూ.7 కోట్ల పనులకు సంబంధించిన అంశాలు ఎజెండాలో పొందుపరచడంతో మిగిలిన సభ్యులు గుర్రుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment