నేటి నుంచే ప్లాస్టిక్ నిషేధం
అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ పరిధిలో బుధవారం నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రానుంది. మానవాళితో పాటు ఇతర జీవరాశులకు ఎంతో హాని చేసే ప్లాస్టిక్ కారణంగా క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులు సంభవిస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించింది. అందుకు అనుగుణంగా మార్కెట్లు, రైతు బజార్లు, పండ్ల దుకాణాల వద్ద అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మేయర్ హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ ఇప్పటికే ప్రత్యామ్నాయాలు, ఇన్‌స్పెక్షన్ సిద్ధాంతాలపై స్కిల్ అప్‌గ్రెడేషన్ ట్రైనింగ్ ప్రొగ్రాంలు నిర్వహించారు. అదనపు కమిషనర్ ఆర్ సోమన్నారాయణ, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్, జోనల్ కమిషనర్లు, ఏఎంవోహెచ్‌లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, స్ట్రీట్‌వెండర్స్, వర్తక వ్యాపారస్తులు, జోన్ల కార్యదర్శులతో జూమ్ యాప్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ నిషేధం
జనవరి ఒకటో నుంచి 120 మైక్రాన్ల లోపు ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలవుతుంది. దీన్ని అతిక్రమించిన చిన్న వ్యాపారులకు తొలిసారి రూ.2,500, రెండోసారి రూ.5 వేల అపరాధ రుసుంతో పాటు వారి ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేయనున్నారు. జీఎస్టీ పరిధిలో ఉన్న బడా వ్యాపారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయించినా, వినియోగించినా మొదటిసారి పట్టుబడితే రూ.20 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.40 వేల అపరాధ రుసుంతో పాటు వారి అన్ని వ్యాపార లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, కలెక్టర్ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment