విశాఖలో డీఆర్ఎం ఆఫీసు
8వ తేదీన ప్రధాని మోదీ విశాఖ రాక
6వ తేదీన రాయగడ డివిజన్‌కు శంకుస్థాపన
దక్షిణ కోస్తా రైల్వే జోన్ శంకుస్థాపన లేదని చెబుతున్న అధికారులు
ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన ప్రభుత్వం
దశాబ్దాల కలగా మిగిలిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశంలో కూటమి ప్రభుత్వం మరోసారి రిక్తహస్తాలు చూపిస్తోంది. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జోన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాయగడ డివిజన్‌కు పీఎం చేతుల మీదుగా శంకుస్థాపనకు చకచకా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ శంకుస్థాపన మాత్రం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కూటమి నేతలు పట్టుబట్టడంతోనే ‘జోన్’కు గ్రహణం పట్టినట్లు తెలుస్తోంది.
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు 2019లో కేంద్రం పచ్చజెండా ఊపింది. జోన్‌కు సంబంధించిన డీపీఆర్‌ని అదే ఏడాది చివరిలో ఇచ్చారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చకుండా కేవలం రాజకీయ కక్షతోనే జోన్‌ను ఆపేశారు. 2022లో జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి డీఆర్‌ఎం కార్యాలయం ఎదురుగా ఉన్న వైర్‌లెస్ కాలనీని ఎంపిక చేశారు. అక్కడ ఉన్న 13 ఎకరాల్లోని 8 ఎకరాల విస్తీర్ణంలో హెడ్‌క్వార్టర్స్‌కు సంబంధించి డిజైన్లకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదముద్ర వేశారు. కాలనీని సైతం పరిశీలించారు. 2022 నవంబర్ 12న ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని శిలాఫలకం కూడా సిద్ధం చేసి చివరి నిమిషంలో రాజకీయ కుట్రతో నిలిపేశారు.
వాయిదాల పర్వమే..
గత నవంబర్ 29న విశాఖలో ప్రధాని పర్యటనకు సర్వం సిద్ధమైంది. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. అందులో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంది. అయితే.. కూటమి నేతలు జోన్ శంకుస్థాపనను వాయిదా వేయాలని పట్టుబట్టడంతో చివరి నిమిషంలో ఆపేశారు. ఆ తర్వాత ప్రధాని పర్యటన కూడా వాయిదా పడింది. ఈ నెల 8న విశాఖ జిల్లాలో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ప్రధాని పాల్గొని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. దీనికి సంబంధించి రైల్వే బోర్డు.. వివిధ రైల్వే డివిజన్ల నుంచి ప్రాజెక్టుల వివరాలు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. వాల్తేరు డివిజన్‌కు మాత్రం ఎలాంటి ఆదేశాలు అందలేదు. అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ మాత్రం రాయగడ డివిజన్ శంకుస్థాపన గురించి ప్రతిపాదనలు పంపించి, విశాఖ జోన్ గురించి అందులో పొందుపరచలేదు. దీంతో ఈసారి కూడా ప్రధాని పర్యటనలో రైల్వే జోన్ శంకుస్థాపన ఉండబోదని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జోన్‌తో పాటు రాయగడ డివిజన్ కానీ..
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తోపాటే వాల్తేరు డివిజన్‌లో కొంత భాగం, ఈస్ట్‌కోస్ట్‌లోని మరికొంత భాగం కలిపి రాయగడ డివిజన్‌ని ప్రకటించారు. రైల్వే జోన్ కోసం ఇప్పటివరకు రూ.106 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. రాయగడ డివిజన్‌కు మాత్రం రూ.70 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే స్టేషన్ పక్కనే రాయగడ డివిజన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పుడు విశాఖలో ఈ డివిజన్ శంకుస్థాపన నిర్వహించి.. జోన్‌ని పక్కన పెడితే వ్యతిరేకత వస్తుందనే కారణంతో.. 6వ తేదీన వర్చువల్‌గా పీఎం చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జోన్ కోసం మరికొద్ది నెలలు ఆగాల్సిందేనని రైల్వే అధికారులు చెబుతున్నారు.
తాత్కాలిక సేవలు కూడా లేనట్లే.!
జోన్ ప్రకటన వచ్చి ఐదేళ్లు గడిచిన తర్వాత.. తాజాగా టెండర్లను ఆహ్వానించారు. అయితే.. కొత్త భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనే ఆదేశాలు ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. ఒకవేళ బిల్డింగ్ నిర్మాణంతో పనిలేకుండా.. జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్‌ఎం కార్యాలయాన్ని వినియోగిస్తారని అనుకున్నారు. కానీ.. కొత్త కార్యాలయం పూర్తయితేనే.. జోన్ కార్యకలాపాలు నిర్వహిస్తామని రైల్వే ఉన్నతాధికారులు సంకేతాలిచ్చినట్లు వాల్తేరు వర్గాలు చెబుతున్నాయి. అయితే జోన్‌ని కూటమి నేతలు ఎన్నికల అంశంగా చూస్తున్నారే తప్ప.. సెంటిమెంట్‌గా చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment