సారూ.. ఇదేమి తీరు!
● అస్తవ్యస్తంగా స్కూల్ కాంప్లెక్స్‌ల పునర్విభజన ● నియోజకవర్గం బయట స్కూళ్లు సైతం విలీనం ● ఆటస్థలం లేకున్నా, కాంప్లెక్స్ కొనసాగింపు ● నిధుల కోసమని హడావుడిగా కసరత్తు ● కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ కొలువులకు గండం
54
51
విశాఖ విద్య: స్కూల్ కాంప్లెక్స్‌ల పునర్విభజనపై హడావుడిగా చేసిన కసరత్తు ఉపాధ్యాయులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. జిల్లా విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మండల స్థాయిలో వీటిని ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో గతంలో 54 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉండగా, పునర్విభజన తరువాత ఈ సంఖ్య 51కు తగ్గింది. దీంతో ఇక్కడ పనిచేసే కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్(సీఆర్పీ) పోస్టులు తగ్గిపోనున్నాయి. స్కూల్ కాంప్లెక్స్ కేంద్రంగానే విద్యాశాఖ అకడమిక్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నందున, వీటిని భవిష్యత్‌లో క్లస్టర్లుగా మార్పు చేసి, ఎంఈవోల అధికారాలకు కత్తెర వేసి, కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంప్లెక్స్‌ల పునర్విభజన చేపట్టగా.. దీనిపై క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన లేకపోవటంతో జిల్లాలో వీటి కూర్పు అస్తవ్యస్తంగా జరిగినట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చసాగుతోంది.
ఇష్టానుసారంగా కాంప్లెక్స్‌ల ఏర్పాటు
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్కూల్ కాంప్లెక్స్‌ల పునర్విభజన చేపట్టామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో వీటి కూర్పు కోసమని విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి స్పష్టమైన విధి విధానాలు జారీ చేశారు. సచివాలయం కేంద్రంగా చేసుకొని, నగరంలో అయితే ఒక వార్డులో, మండలాల్లో అయితే ఒక పంచాయతీలో ఉన్న స్కూళ్లను పరిగణలోకి తీసుకొని స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. కాంప్లెక్స్‌గా గుర్తించే స్కూల్‌కు తప్పనిసరిగా ఆట స్థలం ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ జిల్లాలో ఇందుకు విరుద్ధంగా క్లాంప్లెక్స్‌లు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఉన్న ప్రకాశరావుపేట, యారాడ, వాడపాలెం, బోని, వెల్లంకి స్కూల్ కాంప్లెక్స్‌లను రద్దు చేశారు. కొత్తగా సునీల్‌శర్మ కాలనీ, గోపాలపట్నం, ఎండాడ స్కూళ్లల్లో కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేశారు.
ఈస్ట్ నుంచి నార్త్‌లోకి..
విశాఖ నగరంలోని తూర్పు నియోజకవర్గం పరిధిలో గల వాల్తేర్, వాల్తేర్–1 ప్రాథమిక పాఠశాలలను నార్త్ నియోజకవర్గం పరిధిలో ఉన్న మధురానగర్ కాంప్లెక్స్‌లో కలిపారు. ఇప్పటి వరకు ఆ స్కూళ్లు సమీపంలో ఉన్న కేడీపీఎం కాంప్లెక్స్ పరిధిలో ఉండేవి. దగ్గరలో ఉన్న కేడీపీఎం కాంప్లెక్స్ కాదని.. ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న మధురానగర్‌లో ఎందుకు కలిపారనేది ప్రశ్నార్థకం. అయితే మధురానగర్ కాంప్లెక్స్‌కు కనీస ఆటస్థలం కూడా లేదు. ప్రాథమిక, హైస్కూల్ రెండూ ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తుండటంతో, ఇప్పటికే ప్రాంగణం ఇరుకుగా ఉంటుంది. ఇలాంటి చోట కాంప్లెక్స్‌ను కొనసాగించటంలో ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనేది ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది.
జిల్లాలో గతంలో ఉన్న
స్కూల్ కాంప్లెక్స్‌లు
పునర్విభజన తరువాత
ఏర్పాటు చేసిన కాంప్లెక్స్‌లు
నేడు ఉన్నతస్థాయి సమీక్ష
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను చెరిపివేయాలనే అక్కసుతో కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యలో మార్పులు తీసుకొస్తొంది. కాంప్లెక్స్ పునర్విభజన, అదే విధంగా 117 జీవో రద్దు వంటి అంశాలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీటిపై క్షక్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఏయూలోని అంబేడ్కర్ అసెంబ్లీ హాల్ వేదికగా జోనల్ స్థాయి వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు(పాడేరు డివిజన్), విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు చెందిన విద్యాశాఖాధికారులు 496 మంది వరకు పాల్గొంటున్నారు. పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొనున్నందున జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment