తీసుకెళ్లండి.. చదవండి
● చదవడానికో రెండు పుస్తకాలు
● బుక్ మ్యాజిక్ లైబ్రరీ
ఆధ్వర్యంలో
ఉచితంగా పంపిణీ
ఏయూ క్యాంపస్: చదవడానికి రెండు పుస్తకాలు ఉచితంగా అందిస్తాం.. ఆసక్తి ఉన్నవారు వచ్చి నచ్చిన పుస్తకాలను తీసుకువెళ్లండి.. అంటూ బీచ్ రోడ్డులోని బుక్ మ్యాజిక్ లైబ్రరీ శని, ఆదివారాలలో నిర్వహించిన వినూత్న కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. వైజాగ్ వలంటీర్స్‌తో కలిసి బుక్ మ్యాజిక్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వందలాది మంది పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. తమకు నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకుని మురిపెంగా తీసుకెళ్లారు. ప్రజల్లో పఠనాసక్తికి నిదర్శనంగా ఈ కార్యక్రమం నిలిచింది. ఎంతో విలువైన, ఖరీదైన పుస్తకాలు సైతం ఇక్కడ ఉచితంగా ప్రజలకు అందించారు. నవలలు, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ పుస్తకాలతో పాటు ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు సైతం ఇక్కడ లభించాయి. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో బుక్ మ్యాజిక్ సంస్థ ప్రతి సంవత్సరం ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నిర్వాహకుడు ఎం.హరి తెలిపారు. తమ లైబ్రరీలోని పలు పుస్తకాలతో పాటు దాతల నుంచి స్వీకరించిన పుస్తకాలను ఈ రెండు రోజులు అందుబాటులో ఉంచి పంపిణీ చేశామన్నారు. దాదాపు ఐదారు వందల మంది నగరవాసులు తమకు నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకుని తీసుకెళ్లారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment