ఎట్టకేలకు..!
● ఏయూ ఎగ్జిక్వూటివ్ కౌన్సిల్ సమావేశం
● సెర్చ్ కమిటీకి ఈసీ నామినీ పేరు
● వీసీ నియామకంలో ముందడుగు
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ నియామకంలో ముందడుగు పడింది. రాష్ట్ర స్థాయి ‘సెర్చ్ కమిటీ’కి వర్సిటీ ఎగ్జిక్వూటివ్ కమిటీ నుంచి నామినీ పేరును ఎట్టకేలకు ఖరారు చేశారు. ఏయూలో మంగళవారం ఎగ్జిక్వూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి నుంచి కౌన్సిల్‌లోని కీలక సభ్యులుగా ఉన్న అధికారులు వర్చువల్‌గా సమావేశంలో పాల్గొనగా, ఇక్కడ అందుబాటులో ఉన్న మిగతా సభ్యులంతా హాజరై నామినీపై తుదినిర్ణయం తీసుకున్నారు. దీంతో వీసీ నియామకానికి లైన్ క్లియర్ అయినట్లయింది. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా జి.శశిభూషణరావు ఉన్నారు. రెగ్యులర్ వీసీ నియామకంపై కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. వీసీ ఎంపిక కోసం రాష్ట్ర స్థాయిలో ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీ నుంచి ఒక్కో సభ్యుడి పేరు ఖరారు చేసినా, ఏయూ ఎగ్జిక్వూటివ్ కౌన్సిల్ నుంచి సభ్యుడి పేరును సిఫార్సు చేయటంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇటీవల ఉన్నత విద్యామండలి చైర్మన్ నియామకం జరగడంతో దీనిపై కదలిక వచ్చింది. వీసీ పోస్టు కోసం సెర్చ్ కమిటీ ముగ్గురు పేర్లను సూచిస్తే, అందులో ఒకరిని గవర్నర్ ఫైనల్ చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఏయూ ఎగ్జిక్వూటివ్ కౌన్సిల్‌లో కీలకమైన ఇన్‌చార్జి వీసీ శశిభూషణరావు, రిజిస్ట్రార్ ధనుంజయరావు, రెక్టార్ కిశోర్ బాబు హాజరుకాకుండానే సమావేశం ముగిసింది. ఈ ముగ్గురు వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేయడంతోనే కౌన్సిల్ సమావేశానికి దూరం కావాల్సి వచ్చింది. నామినీ పేరు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే వీసీ పోస్టుపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment