కూటమి షోలో అష్టకష్టాలు
● మోదీ సభకు రావాలంటూ డ్వాక్రా మహిళలపై తీవ్ర ఒత్తిడి ● శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం నుంచి కూడా జనాల తరలింపు ● మధ్యాహ్నం పాచిపోయిన పులిహోర ● 2,280 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు స్కూల్ బస్సుల సేకరణ ● దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు ● ఆర్టీసీ బస్సులు లేక కాంప్లెక్సు, బస్టాండ్‌లో ప్రయాణికుల పాట్లు ● చివరకు ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ బస్సుల్లోనూ ప్రజల తరలింపు
విశాఖ సిటీ : ఆఫీస్‌లకు వెళ్లడానికి బస్సు లేదు. ఊరెళ్లాలంటే మూడు, నాలుగు గంటలైనా బస్సు రాలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లడానికి ఆటో కనిపించలేదు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, టాటా మ్యాజిక్‌లు.. ఇలా అన్నింటినీ కూటమి నేతలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు జనం తరలించేందుకు వినియోగించారు. సాధారణ ప్రజల రవాణా సౌకర్యాలపై కనీసం దృష్టి పెట్టలేదు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. కూటమి షోను విజయవంతం చేయడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఉద్యోగాలకు, పనులకు వెళ్లడానికి బస్సులు గానీ, ఆటోలు గాని లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక బహిరంగ సభ పేరుతో సాధారణ ప్రజలను, విద్యార్థులను, ప్రయాణికులను అవస్థలకు గురి చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
జనాలకు పాచిపోయిన పులిహోర
ప్రధాని సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టారు. ఈ సభకు రావాలని డ్వాక్రా గ్రూపు మహిళల ఒత్తిడి తీసుకువచ్చారు. లేనిపక్షంలో సంఘాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో సభకు వచ్చే వారికి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ముట్టజెప్పారు. కొన్ని చోట్ల మాత్రం రూ.500, రూ.300 మాత్రమే ఇచ్చారు. మధ్యలో ఉన్న వారు కొంత నొక్కేస్తున్నారని జనాలు మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని సభ ఉండగా.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి ఉదయమే బస్సుల్లో జనాలను తరలించారు. వీరికి మధ్యాహ్నం భోజనం కింద పాచిపోయిన పులిహోర బాక్సులు అందజేశారు. వాటిని తెరిచి వెంటనే దుర్వాసన రావడంతో అందరూ విసిరికొట్టారు. దీంతో చాలా మంది ఆకలితోనే ఉన్నారు. కొంత మంది మాత్రం సభ వరకు ఉండకుండా మధ్యలోనే వెళ్లిపోయారు.
భారీగా వాహనాల సేకరణ
ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో బుధవారం ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల కోట్లు విలువైన పలు ప్రాజెక్టులకు పీఎం చేతుల మీదుగా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డింది. ఉమ్మడి విశాఖ నుంచే కాకుండా విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేపట్టింది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను తమ ఆధీనంలోకి తీసుకుంది. అన్ని ప్రాంతాల నుంచి 2,280 బస్సులను జనాల తరలింపునకు మళ్లించింది. చివరకు ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ బస్సులను కూడా విడిచిపెట్టలేదు. అలాగే 2,280 ఆటోలు, 382 మినీ బస్సులు, 150 టాటా మ్యాజిక్‌లలో జనసమీకరణ చేపట్టింది. దీంతో అంతర జిల్లాల సర్వీసులు పూర్తిగా తగ్గిపోయాయి. విశాఖలో ఆర్టీసీ సేవలు 80 శాతం మేర నిలిచిపోయాయి.
ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు ఆటో సర్వీసులు కూడా జనసమీకరణ కోసం సేకరించడంతో నగరంలో రవాణా సేవలు లేకుండా పోయాయి. దీంతో ఉద్యోగాలు, పనుల కోసం వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అంతర జిల్లాల సర్వీసులు లేకపోవడంతో గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూపులు చూశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌తో పాటు నగరంలో ప్రతి బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రధాని సభను విజయవంతం చేయడంపైనే దృష్టి పెట్టి ప్రజలకు ప్రత్యామ్నాయాలను కల్పించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలల బస్సులు స్వాధీనం
ప్రధాని సభ పేరుతో కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. బస్సులు, ఆటోలనే కాకుండా స్కూల్, కాలేజీ బస్సులను కూడా విడిచిపెట్టలేదు. వాటిని కూడా బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దీంతో విద్యార్థులు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా స్కూల్, కాలేజీ యాజమాన్యాలు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం తమ బల ప్రదర్శన కోసం విద్యార్థుల భవివతవ్యాన్ని సైతం పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment